2015లోనూ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు ప్రమాదం... నాడు స్వల్పగాయాలు

  • ఆరేళ్ల కిందట నాగాలాండ్ లో కూలిన హెలికాప్టర్
  • గాల్లో 20 అడుగులు ఎత్తులో నిలిచిన ఇంజిన్
  • కిందపడిపోయిన హెలికాప్టర్
  • అప్పట్లో లెఫ్టినెంట్ జనరల్ హోదాలో ఉన్న రావత్
భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17వి5 రకం హెలికాప్టర్ తమిళనాడులో కుప్పకూలిన ఘటన యావత్ దేశాన్ని నిశ్చేష్టకు గురిచేసింది. దేశ అత్యున్నత సైనికాధికారి బిపిన్ రావత్ ఆ హెలికాప్టర్ లో ఉండడమే అందుకు కారణం.  

ఇదిలావుంచితే, రావత్ ఆరేళ్ల కిందట ఓ హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. 2015లో ఆయన లెఫ్టినెంట్ జనరల్ హోదాలో ఉండగా, మరో ముగ్గురు ఆర్మీ సిబ్బందితో కలిసి నాగాలాండ్ లో చీటా హెలికాప్టర్ ఎక్కారు. ఫిబ్రవరి 3న ఆ హెలికాప్టర్ దిమాపూర్ జిల్లాలోని రగ్బాపహార్ హెలిప్యాడ్ నుంచి గాల్లోకి ఎగిసింది. అయితే టేకాఫ్ తీసుకున్న కొన్ని సెకన్లలోనే కూలిపోయింది. గాల్లో 20 అడుగుల ఎత్తుకు ఎగిరిన అనంతరం ఇంజిన్ నిలిచిపోవడంతో చీటా హెలికాప్టర్ కిందికిపడిపోయింది. ఈ ఘటనలో రావత్ కు స్వల్ప గాయాలయ్యాయి.

ఇవాళ తమిళనాడులోని సూలూరు ఎయిర్ బేస్ నుంచి వెల్లింగ్టన్ లోని రక్షణ రంగ కళాశాలలో ఉపన్యసించడానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఛాపర్ లో రావత్ తో పాటు ఆయన అర్ధాంగి మధూలిక, రక్షణ శాఖ సహాయకుడు, సెక్యూరిటీ కమాండోలు, ఓ ఐఏఎఫ్ పైలెట్ ఉన్నారు.


More Telugu News