ఏబీపీ సీఓటర్ సర్వే.. ఉత్తరప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటే..?

  • యోగి ఆదిత్యనాథ్ మరో సారి సీఎం అవుతారన్న ఏబీపీ సీఓటర్ సర్వే
  • యోగికి 44 శాతం మంది ప్రజల మద్దతు
  • అఖిలేశ్ కు మద్దతు పలికిన 31 శాతం మంది
దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ అత్యంత ముఖ్యమైనది. యూపీలో అధికారంలో ఉండే పార్టీకి ఢిల్లీలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దేశ రాజకీయాల్లో ఆ పార్టీ చక్రం తిప్పుతుంది. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని పార్టీలు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. మరోవైపు యూపీలో ఏ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు? ఎవరు సీఎం కాబోతున్నారు? అనే విషయంపై పలు సంస్థలు సర్వేలు చేస్తున్నాయి.

యోగి ఆదిత్యనాథ్ మరోసారి యూపీ సీఎం పగ్గాలను అందుకోబోతున్నారని ఏబీపీ సీఓటర్ సర్వే తెలిపింది. ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో 44 శాతం మంది ప్రజలు యోగికి తమ మద్దతును ప్రకటించారు. 31 శాతం మంది సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సీఎం కావాలని కోరుకోగా, 15 శాతం మంది బీఎస్పీ అధినేత్రి మాయావతి వైపు మొగ్గు చూపారు.

43 శాతం ప్రజలు యోగి పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. 21 శాతం మాత్రం పర్వాలేదు అన్నారు. 36 శాతం మంది యోగి పనితీరు చెత్తగా ఉందని తెలిపారు. ఏదేమైనప్పటికీ, యోగి మరోసారి సీఎం కాబోతున్నారని సర్వే వెల్లడించడంతో బీజేపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి.


More Telugu News