విక్కీ కౌశల్-కత్రిన కైఫ్ పెళ్లి: అతిథులు తమ ఫోన్లను తీసుకురావొద్దంటూ పెళ్లి పత్రికలో విజ్ఞప్తి

  • ఈ నెల 9న వికీ కౌశల్, కత్రినాల పెళ్లి
  • రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్
  • ఫోర్ట్ బర్వారా వేదికగా పెళ్లి
  • పరిమిత సంఖ్యలో అతిథులు
బాలీవుడ్ లో అతి భారీ వివాహ మహోత్సవంగా విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ల పెళ్లి గురించి చెప్పుకుంటున్నారు. చాలాకాలంగా ప్రేమలో ఉన్న ఈ జోడీ డిసెంబరు 9న పెళ్లితో ఒకటి కానుంది. వీరి పెళ్లికి రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ బర్వారా కోట ఆతిథ్యమిస్తోంది. ఇక్కడి సిక్స్ సెన్సెస్ రిసార్ట్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ల పెళ్లికి అందంగా ముస్తాబవుతోంది. నేటి నుంచి పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి.

కాగా, విక్కీ, కత్రినాల పెళ్లి పత్రికలో ఓ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. పెళ్లికి వచ్చే అతిథులు జైపూర్ విమానాశ్రయం నుంచి రణథంబోర్ వచ్చే క్రమంలో రోడ్డు ప్రయాణాన్ని ఆస్వాదిస్తారని భావిస్తున్నామని తెలిపారు. రాజస్థాన్ ప్రకృతి అందాలను, ముచ్చటైన గ్రామాలను తిలకిస్తూ ఉల్లాసవంతమైన ప్రయాణ అనుభూతిని సొంతం చేసుకుంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

అంతేకాదు, పెళ్లికి హాజరయ్యేటప్పుడు తమ ఫోన్లను తమకు కేటాయించిన గదుల్లోనే వదిలి రావాలని సూచించారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం, పెళ్లి సమయంలో సోషల్ మీడియాను ఉపయోగించడం నిషేధించామని పెళ్లిబృందం తరఫున ఆ శుభలేఖలో స్పష్టం చేశారు. కాగా, కరోనా నేపథ్యంలో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ల వివాహానికి పరిమిత సంఖ్యలోనే ప్రముఖులను ఆహ్వానించారు.

కరణ్ జొహార్, ఫరాఖాన్, అంగద్ బేడీ, నేహా ధుపియా, శ్వారి వాఘ్, కబీర్ ఖాన్, మినీ మాధుర్, అంగీరా థర్, నిత్యా మెహ్రా, కత్రినా వ్యక్తిగత వైద్య నిపుణుడు డాక్టర్ జ్యుయెల్ గమాడియా, కత్రినా ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా, కత్రినా స్టయిలిస్ట్ అమిత్ ఠాకూర్, డేనియల్ బాయెర్ (మేకప్ ఆర్టిస్ట్) లు ఈ పెళ్లికి కచ్చితంగా హాజరవుతారని తెలుస్తోంది.

అటు, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ, రోహిత్ శెట్టి, అలీ అబ్బాస్ జాఫర్ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.


More Telugu News