‘యాషెస్’ సిరీస్ వెనక ఇంత కథ ఉందా?

  • 1882లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన ఇంగ్లండ్
  • ఇంగ్లండ్ క్రికెట్ చనిపోయిందంటూ మీడియా సంస్మరణ
  • దేహాన్ని దహనం చేసి బూడిదను ఆస్ట్రేలియా తీసుకెళ్తారని వ్యంగ్య కథనం
  • ఆ బూడిదను తిరిగి తీసుకొస్తానని అప్పటి కెప్టెన్ ప్రతిన
  • దాదాపు 140 ఏళ్లుగా ‘బూడిద’ పేరుతోనే సిరీస్
భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌ను ప్రపంచం ఎలా చూస్తుందో, ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు సిరీస్‌ను కూడా అలాగే చూస్తుంది. ‘యాషెస్’ (బూడిద) పేరుతో నిర్వహించే టెస్టు సిరీస్‌ను ఇరు జట్లు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి. అందుకోసం హోరాహోరీగా పోరాడతాయి. సరే, బూడిద సిరీస్‌గా పేరుకెక్కిన ఈ సిరీస్‌కు అసలు ఆ పేరు ఎందుకొచ్చిందన్నది చాలామందిని వేధించే ప్రశ్న. ఇప్పుడా ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.

1882లో తొలిసారి ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి. ఈ సిరీస్‌లో తొలిసారి ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఈ ఓటమిపై ఇంగ్లిష్ న్యూస్ పేపర్ ఒకటి ప్రముఖంగా రాసుకొచ్చింది. ఈ ఓటమిని హేళన చేస్తూ ఇంగ్లిష్ క్రికెట్ చచ్చిపోయిందని పేర్కొంటూ సంస్మరణ ప్రకటించింది. దేహాన్ని దహనం చేసి, బూడిదను ఆస్ట్రేలియాకు తీసుకెళ్తారని వ్యంగ్యంగా పేర్కొంది.

ఈ కథనంపై స్పందించిన అప్పటి ఇంగ్లిష్ కెప్టెన్.. ఆ ‘బూడిద’ను తిరిగి తీసుకొస్తానని ప్రతినబూనాడు. దీనిపైనా కథనాన్ని ప్రచురించిన ఆంగ్ల పత్రికలు యాషెస్‌ను తిరిగి తీసుకురావాలని ఇంగ్లండ్ కెప్టెన్ తపన పడుతున్నట్టు పేర్కొన్నాయి. ఇలా ‘యాషెస్’ అన్న పదం జనాల్లోకి చేరిపోయింది. ఇక అప్పటి నుంచి జరిగే టెస్టు సిరీస్‌కు యాషెస్ అన్న పేరు స్థిరపడిపోయింది.

ఆ తర్వాత కొన్ని వారాలకే హాన్ ఐవో బ్లిగ్ సారథ్యంలోని ఇంగ్లిష్ జట్టు ఆస్ట్రేలియాకు బయలుదేరింది. ఈ సందర్భంగా బ్లిగ్ మాట్లాడుతూ... యాషెస్‌ను తిరిగి తీసుకొస్తానని శపథం చేశాడు. అదే సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ విల్ మర్దోక్ కూడా ఇలాంటి ప్రకటనే చేశాడు. యాషెస్‌ను ఇంగ్లండ్‌ పట్టుకెళ్లకుండా అడ్డుకుంటామని పేర్కొన్నాడు. అలా ప్రారంభమైన యాషెస్.. దాదాపు 140 సంవత్సరాలుగా అదే పేరుతో కొనసాగుతోంది.

తాజాగా ఈ నెల 8 నుంచి జనవరి 18 వరకు ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ జరగనుంది. ఇందులో భాగంగా ఐదు టెస్టులు జరగనున్నాయి. యథావిధిగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఈ యాషెస్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


More Telugu News