నామమాత్రపు రుసుముతో రిజిస్ట్రేషన్ చేసి సర్వహక్కులు కల్పిస్తున్నాం: ఓటీఎస్ పై సజ్జల వివరణ

  • ఓటీఎస్ తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం
  • విపక్షాల విమర్శల దాడి
  • ఓటీఎస్ ను అంగీకరించవద్దంటున్న టీడీపీ
  • సజ్జల ప్రెస్ మీట్
ఓటీఎస్ పథకంపై విపక్షాలు విమర్శల దాడులు చేస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు. ఓటీఎస్ తో పేదలపై భారం మోపుతున్నారంటూ ముఖ్యంగా టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై సజ్జల స్పందిస్తూ.... ఓటీఎస్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది రూ.4 వేల కోట్లు మాత్రమేనని, ఓటీఎస్ కోసం నామమాత్రపు రుసుం వసూలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఓటీఎస్ అనేది స్వచ్ఛందమని, ఎవరిపైనా ఒత్తిడి ఉండదని అన్నారు.

ఓటీఎస్ లో భాగంగా కార్పొరేషన్ పరిధిలో రూ.20 వేలు, మున్సిపాలిటీల పరిధిలో రూ.15 వేలు, పంచాయతీల పరిధిలో రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుందని సజ్జల వెల్లడించారు. ఓటీఎస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి సర్వహక్కులు కల్పిస్తున్నామని వివరించారు. ఓటీఎస్ తో పేదలకు నష్టం వాటిల్లుతుందన్న ప్రచారంలో నిజంలేదని అన్నారు. ఇకమీదట ఎవరైనా ఓటీఎస్ పై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా వెళతామని, చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఓటీఎస్ కు ఎవరూ మద్దతు ఇవ్వొద్దని ప్రతిపక్ష నేత చంద్రబాబు అంటున్నారంటే దాన్ని ఏమనాలి? అని ప్రశ్నించారు.

ప్రజలెవరూ ఓటీఎస్ కు డబ్బులు చెల్లించవద్దని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని టీడీపీ ప్రచారం చేస్తుండడం తెలిసిందే.

ఓటీఎస్ అంటే వన్ టైమ్ సెటిల్ మెంట్. దీన్నే జగనన్న సంపూర్ణ భూహక్కు పేరిట ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 2011 ఆగస్టు 15వ తేదీకి ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివాస పత్రాలు, డి-ఫారం పట్టాల కింద నివాస గృహాలు నిర్మించుకున్నవారికి ఓటీఎస్ వర్తిస్తుంది. ఆ మేరకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణ కూడా చేశారు.

ఈ పథకం ఎలా ఉంటుందంటే... పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల పరిధిలో ఓటీఎస్ కు వివిధ రేట్లు నిర్ణయించారు. అయితే లబ్దిదారుడు గృహనిర్మాణం కోసం తీసుకున్న రుణంలో ఇంకా చెల్లించాల్సిన మొత్తం... ఓటీఎస్ రుసుం కంటే తక్కువ ఉంటే ఆ తక్కువగా ఉన్న మొత్తాన్నే చెల్లిస్తే సరిపోతుంది. ఓ కార్పొరేషన్ పరిధిలో లబ్దిదారుడు రూ.16 వేల మేర రుణం చెల్లించాల్సి ఉంటే, ఓటీఎస్ చెల్లింపు మొత్తం రూ.20 వేలకు బదులు ఆ వ్యక్తి రూ.16 వేలు చెల్లిస్తే సరిపోతుంది.

ఇక హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఎలాంటి రుణం తీసుకోకుండా ఇళ్లు నిర్మించుకున్న వారికి కేవలం రూ.10 నామమాత్రపు రుసుంతో వారి పేరు మీద ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేయించి డాక్యుమెంట్లు అందిస్తుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం చెబుతోంది.


More Telugu News