ఉద్యోగాల విషయంలో దళారుల మోసపూరిత మాటలు నమ్మొద్దు: టీటీడీ

  • సోషల్ మీడియాలో వచ్చే ఉద్యోగ ప్రకటనలు నమ్మొద్దు
  • అలాంటిదేమైనా ఉంటే మేమే తెలియజేస్తాం
  • తప్పుడు ప్రకటనలతో మోసం చేసే వారిపై చర్యలు
ఉద్యోగాల విషయంలో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) హెచ్చరించింది. టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు గుప్పిస్తున్నారని, ఇలాంటి ప్రకటనలను నమ్మొద్దని కోరింది. గతంలోనూ కొందరు అమాయకులు ఇలాంటి ప్రకటనలకు ఆకర్షితులై మోసపోయారని పేర్కొంది. కాబట్టి సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఇలాంటి ప్రకటనలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.

ప్రజలను మోసం చేస్తున్న ఇలాంటి వారిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపింది. నిజంగానే తాము ఉద్యోగాల భర్తీ చేపడితే ముందుగా పత్రికల్లోను, టీటీడీ వెబ్‌సైట్‌లోనూ అధికారికంగా ప్రకటన ఇస్తామని పేర్కొంది. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ప్రకటనలను విశ్వసించవద్దని, అలాంటి ప్రకటనలు చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.


More Telugu News