బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను విడిచిపెట్టిన ఈడీ అధికారులు.. ముంబై విడిచి వెళ్లేందుకు అనుమతి

  • రూ. 200 కోట్ల మనీలాండరింగ్ వ్యవహారంలో సుఖేశ్ చంద్రశేఖర్ అరెస్ట్
  • అతడితో జాక్వెలిన్‌కు సంబంధాలు
  • ముంబై విమానాశ్రయంలో నటిని నిర్బంధించిన అధికారులు
  • ఈడీ ఆదేశాలతో వదిలిపెట్టిన వైనం
  • ఢిల్లీలో జాక్వెలిన్‌ను విచారించే అవకాశం
ఈడీ లుకౌట్ నోటీసుల నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ముంబై విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు స్వల్ప నిర్బంధం తర్వాత ఆమెను విడిచిపెట్టారు. ముంబై విమానాశ్రయం విడిచి వెళ్లేందుకు అనుమతించారు.

రూ.200 కోట్ల మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన సుఖేశ్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్‌కు సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలున్నాయి. విచారణ సమయంలో సుఖేశ్ జాక్వెలిన్ పేరు కూడా వెల్లడించినట్టు సమాచారం. అంతేకాదు, సుఖేశ్ ఆమెకు రూ.50 లక్షలకు పైగా విలువ చేసే గుర్రం, రూ.9 లక్షల విలువ చేసే పిల్లిని బహుమానంగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జాక్వెలిన్ కు సమన్లు జారీ చేసింది.

ఈడీ విచారణకు హాజరైన జాక్వెలిన్‌పై కొన్నాళ్ల కిందట లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ముంబై విమానాశ్రయానికి వచ్చిన నటిని అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు ఆమెపై జారీ అయిన లుకౌట్ నోటీసుల గురించి చెప్పారు. ఆ తర్వాత వారు ఆ విషయాన్ని ఈడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాలపై జాక్వెలిన్‌ను విమానాశ్రయం విడిచి వెళ్లేందుకు అనుమతించారు. నిజానికి లుకౌట్ నోటీసులు ఉన్నవారు దేశం విడిచి వెళ్లడాన్ని అనుమతించరు. కాగా, నటిని త్వరలోనే ఢిల్లీలో విచారించే అవకాశం ఉందని సమాచారం.


More Telugu News