ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ నంబరులో ‘ఎస్‌ఈఎక్స్’ సిరీస్‌ను తొలగించండి: రవాణా శాఖను ఆదేశించిన ఢిల్లీ మహిళా కమిషన్

  • ఇటీవల స్కూటర్ కొనుగోలు చేసిన యువతికి ‘ఎస్‌ఈఎక్స్’ సిరీస్‌తో నంబరు కేటాయింపు
  • ఈ సిరీస్ వల్ల అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని యువతి ఆవేదన
  • మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన యువతి
  • మొత్తం సిరీస్‌నే తొలగించాలని ఆదేశం
తన స్కూటర్ రిజిస్ట్రేషన్ నంబరులో ‘ఎస్‌ఈఎక్స్’ అనే అక్షరాలు ఉన్నాయని, దీనివల్ల పలు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఢిల్లీలో ఓ యువతి మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. నిత్యావసరాలు కొనడానికి కూడా తాను స్కూటరుపై బయటకు వెళ్లలేకపోతున్నానని, తన నంబరు ప్లేటుపై ఉన్న ‘ఎస్‌ఈఎక్స్’ అక్షరాలు ఇబ్బందికరంగా ఉన్నాయని ఆమె తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమె ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న మహిళా కమిషన్ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ నంబరులో ‘ఎస్‌ఈఎక్స్’ అనే సిరీస్‌ను తొలగించాలంటూ రవాణా శాఖను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, ఈ సిరీస్‌లో రిజిస్టర్ అయిన వాహనాల సంఖ్యను కూడా తమకు సమర్పించాలని, నాలుగు రోజుల్లో నివేదిక అందించాలని రవాణా శాఖను ఆదేశించింది.


More Telugu News