బలహీనపడిన 'జవాద్' తుపాను... దిశ మార్చుకుని ఒడిశా వైపు పయనం

  • తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన జవాద్
  • విశాఖకు ఆగ్నేయంగా 180 కిమీ దూరంలో కేంద్రీకృతం
  • గంటకు 3 కిమీ వేగంతో పయనం
  • మరికొన్ని గంటల్లో బలహీనపడే అవకాశం
బంగాళాఖాతంలో ఏర్పడిన 'జవాద్' తుపాను బలహీనపడిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర తీరానికి సమీపానికి వచ్చిన అనంతరం ఇది మలుపు తీసుకుని ఒడిశా దిశగా పయనిస్తోందని తెలిపింది. ప్రస్తుతం ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోందని, విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 180 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్ పూర్ కు 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వివరించింది.

గడచిన 6 గంటలుగా ఇది చాలా నిదానంగా కదులుతోందని, గంటకు 3 కిమీ వేగంతో పయనిస్తోందని ఐఎండీ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఇది బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిందని వెల్లడించింది. రేపు ఒడిశాలోని పూరీ తీరానికి చేరువలోకి వెళ్లే అవకాశాలున్నాయని తెలిపింది.

రాగల 24 గంటల్లో ఇంకా బలహీనపడుతుందని, క్రమంగా ఇది పశ్చిమ బెంగాల్ వైపు వెళుతుందని వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని, తీరం వెంబడి గంటకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది.


More Telugu News