రహానే టెస్ట్​ వైస్​ కెప్టెన్సీకి ఎసరు.. రోహిత్​ శర్మకు అప్పగింత!

  • కొంతకాలంగా రహానే పేలవ ప్రదర్శన
  • గత 11 టెస్టుల్లో రహానే యావరేజి 19 పరుగులే!
  • కివీస్ తో మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో 39 రన్స్
  • గాయం పేరిట గౌరవంగా తప్పించిన మేనేజ్ మెంట్!
ఇటీవల కాలంలో వరుసగా విఫలమవుతున్న అజింక్యా రహానేకు జట్టులో స్థానం ప్రశ్నార్థకమవుతోంది. ఓవైపు యువ ఆటగాళ్లు తమ స్థానాలను మరింత పదిలం చేసుకుంటుంటే, అనుభవజ్ఞుడైన రహానే పేలవ ఆటతీరుతో విమర్శకులకు పని కల్పిస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్ తో రెండో టెస్టుకు ఏకంగా జట్టులోనే స్థానం కోల్పోయాడు. గాయం కారణంగానే తప్పిస్తున్నాం అని మేనేజ్ మెంట్ పేర్కొన్నప్పటికీ... రహానే సీనియారిటీని గౌరవిస్తూ గాయం పేరిట పక్కనబెట్టినట్టు తెలుస్తోంది.

జట్టులో స్థానమే కాదు, ఇప్పుడు రహానే వైఎస్ కెప్టెన్సీ కూడా ప్రమాదంలో పడింది. టెస్టుల్లో టీమిండియా వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మను నియమించేందుకు బోర్డు సిద్ధమైంది. రేపో, మాపో ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. త్వరలో దక్షిణాఫ్రికా పర్యటన ఉండడంతో ఆ టూర్ కు కోహ్లీకి డిప్యూటీగా రోహిత్ శర్మ వ్యవహరిస్తాడని బోర్డు వర్గాలంటున్నాయి.

కాగా, రహానేకి గత కొన్నాళ్లుగా చాలా అవకాశాలు ఇచ్చారు. అయితే, ఎప్పుడో ఒక ఇన్నింగ్స్ లో తప్పిస్తే అతడి వైఫల్యాలే ఎక్కువ. గత 11 టెస్టుల్లో రహానే పరుగుల సగటు 19 మాత్రమే. న్యూజిలాండ్ తో తాజా టెస్టు సిరీస్ లో మొదటి మ్యాచ్ కు రహానే నాయకత్వం వహించాడు. ఆ టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి రహానే చేసింది 39 పరుగులే.


More Telugu News