పాకిస్థాన్‌లో దారుణం.. శ్రీలంక మేనేజర్‌పై దాడిచేసి, సజీవ దహనం

  • తన కార్యాలయం గోడపై అంటించిన ఖురాన్ సూక్తులు ఉన్న పోస్టర్ చించివేత
  • దీంతో ఆగ్రహించిన కార్మికులు 
  • నినాదాలు చేస్తూ మేనేజర్‌ను చావబాదిన వైనం
  • కొన ఊపిరితో ఉండగానే నిప్పు పెట్టి దహనం
  • పాకిస్థాన్‌కు సిగ్గుచేట్టన్న ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. దైవదూషణ ఆరోపణలపై శ్రీలంక జాతీయుడిపై దాడిచేసి, ప్రాణం ఉండగానే దహనం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపింది. ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఈ ఘటనపై తీవ్రస్థాయిలో స్పందించారు. నిందితులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
 
డాన్.కామ్’ కథనం ప్రకారం.. సియోల్‌కోట్‌లోని వజీరాబాద్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో శ్రీలంకకు చెందిన ప్రియాంత కుమార (40) ఎక్స్‌పోర్టు మేనేజరుగా పనిచేస్తున్నారు. తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ) అనే కరడుగట్టిన మతవాద సంస్థ ఆయన కార్యాలయానికి సమీపంలోని గోడపై ఓ పోస్టరు అంటించింది. ఆ పోస్టర్‌పై ఖురాన్ సూక్తులు ముద్రించి ఉన్నాయి.

తన కార్యాలయ గోడపై అతికించిన ఆ పోస్టరును ప్రియాంత చింపివేసి చెత్తబుట్టలో పడేశారు. అది గమనించిన ఇద్దరు కార్మికులు విషయాన్ని తోటి కార్మికులకు చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. అందరూ కలిసి ఆయన కార్యాలయం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. దైవదూషణకు పాల్పడ్డాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసి మూకుమ్మడిగా ప్రియాంతపై దాడిచేశారు. వారిలో తీవ్రంగా గాయపడిన ప్రియాంతను బతికి ఉండగానే మంటలు అంటించి తగలబెట్టేశారు. ఈ దురాగతాన్ని కొందరు తమ ఫోన్లలో బంధించి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో వైరల్ అయింది.

మరోవైపు, సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ స్పందిస్తూ.. సియోల్‌కోట్ ఫ్యాక్టరీపై జరిగిన దాడిని ‘భయంకరమైన విజిలెంట్ దాడి’గా అభివర్ణించారు. శ్రీలంక మేనేజరును సజీవంగా దహనం చేయడం పాకిస్థాన్‌కు మాయనిమచ్చ అన్నారు. ఈ కేసు దర్యాప్తును తాను స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. నిందితుల్లో ఏ ఒక్కరినీ వదిలి పెట్టబోమని, చట్టప్రకారం వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. కాగా, 2010లోనూ సియోల్‌కోట్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఇద్దరు అన్నదమ్ములపై దోపిడీ దొంగల ముద్రవేసిన కొందరు పోలీసు సమక్షంలో కొట్టి చంపారు.


More Telugu News