పాజిటివ్, నెగటివ్ ఎలా అయింది?.. ఐసోలేషన్ నుంచి ఎలా తప్పించుకున్నాడు?: సౌతాఫ్రికా వాసి పరారీపై విచారణకు ఆదేశించిన కర్ణాటక

  • దేశం విడిచి ఎలా వెళ్లగలిగాడు?
  • ప్రైవేటు ల్యాబ్ లో అక్రమాలపై అనుమానాలు
  • జాడలేని పదిమందిని కూడా ట్రేస్ చేస్తామన్న మంత్రి
దేశంలో తొలి ఒమిక్రాన్ రోగిగా గుర్తింపు పొందిన 66 ఏళ్ల దక్షిణాఫ్రికా వాసి ఐసోలేషన్ నుంచి తప్పించుకుని దేశం విడిచి వెళ్లడాన్ని కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పాజిటివ్‌గా తేలిన మూడు రోజుల్లోనే అతడికి నెగటివ్ ఎలా వచ్చిందని అనుమానం వ్యక్తం చేసింది. బాధితుడిని పరీక్షించిన ప్రైవేటు ల్యాబ్ పై అనుమానాలు వ్యక్తం చేసింది. జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిన నమూనాల నివేదిక రాకుండానే దేశం విడిచి ఎలా వెళ్లగలిగాడు? వంటి అంశాలపై విచారణకు ఆదేశించింది. ప్రైవేటు ల్యాబ్ లో అతడికి పక్కాగా పరీక్షలు నిర్వహించారా? లేకుంటే ఏమైనా అవకతవకలు జరిగాయా? అన్న దానిపైనా విచారణ జరపాలంటూ రెవెన్యూశాఖ మంత్రి ఆర్. అశోక్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు.

ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై అధ్యక్షతన నిన్న జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. అలాగే, దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన పది మంది జాడ తెలియరావడం లేదంటూ వస్తున్న వార్తలపై స్పందించిన మంత్రి వారిని ట్రేస్ చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. వారిని గుర్తించే సమర్థత పోలీసులకు ఉందని పేర్కొన్నారు. అందరూ బాధ్యతతో మెలగాలని, ఎవరూ తమ ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకోవద్దని కోరారు.


More Telugu News