32 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం.. రేపు ఉదయానికి ఏపీని తాకే అవకాశం

  • విశాఖకు 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం
  • ఇవాళ రాత్రి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం
  • రేపు ఉదయానికి 90 కిలోమీటర్ల వేగం
  • అప్రమత్తంగా ఉండాలని సూచించిన విపత్తు నిర్వహణ కమిషనర్
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం 32 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతోందని, విశాఖపట్నానికి 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ కమిషనర్ కన్నబాబు చెప్పారు. రాబోయే 24 గంటల్లో అది జవాద్ తుపానుగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. రేపు ఉదయానికి ఉత్తరాంధ్ర–ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముందన్నారు. దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, చాలా చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుందన్నారు.

ఇవాళ అర్ధరాత్రి నుంచి తీరం వెంట 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. రేపు ఉదయం 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాలువలు, ఇతర ప్రవాహాల దగ్గర జాగ్రత్తగా ఉండాలన్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ), పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ సిబ్బంది కలిసి పనిచేయాలని విశాఖ కలెక్టర్ మల్లికార్జున ఆదేశించారు. సహాయ చర్యల కోసం 66 మంది ఎన్డీఆర్ఎఫ్, 55 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరించామన్నారు.


More Telugu News