'ఎన్డీయే' అంటే కొత్త అర్థం చెప్పిన కేటీఆర్

  • లాక్ డౌన్ సమయంలో వలస కూలీల దుస్థితి
  • వలస కూలీల మరణాలపై డేటా లేదన్న కేంద్రం
  • లోక్ సభలో వెల్లడించిన కేంద్రమంత్రి 
  • కేంద్రంపై సర్వత్రా విమర్శలు
  • 'నో డేటా అవైలబుల్' అంటూ కేటీఆర్ వ్యంగ్యం
దేశంలో కరోనా లాక్ డౌన్ సమయంలో చోటుచేసుకున్న కార్మికుల మరణాల సంఖ్య, ఉపాధి కోల్పోయిన వలస కూలీల సంఖ్యకు సంబంధించి  తమ వద్ద ఎలాంటి డేటా లేదని కేంద్ర కార్మిక శాఖ లోక్ సభలో చెప్పడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. 'ఎన్డీయే' అంటే కొత్త అర్థం చెప్పారు. ఎన్డీయే అంటే 'నో డేటా అవైలబుల్' గవర్నమెంట్ అంటూ ఎద్దేవా చేశారు.

"ఎంత మంది ఆరోగ్య సిబ్బంది చనిపోయారో ఆ డేటా కూడా వీళ్ల వద్ద ఉండదు. కరోనా కారణంగా ఎన్ని మధ్య, చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయో ఆ డేటా కూడా వీళ్ల వద్ద ఉండదు. వలస కార్మికులు ఎంతమంది చనిపోయారో ఆ డేటా కూడా వీళ్ల వద్ద ఉండదు. లాక్ డౌన్ సమయంలో ఉద్యోగాల్లేక ఎంత మంది అలమటించారో ఆ డేటా కూడా వీళ్ల వద్ద ఉండదు. రూ.20 లక్షల కోట్ల కరోనా ప్యాకేజి ఎవరికి అందిందో ఆ జాబితా కూడా వీళ్ల వద్ద ఉండదు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో ఎంతమంది రైతులు చనిపోయారో ఆ డేటా కూడా వీళ్ల వద్ద ఉండదు" అంటూ కేటీఆర్ ఎన్డీయే సర్కారును ఘాటుగా విమర్శించారు.


More Telugu News