ఈ ఉదయం కొండచరియలు విరిగిపడి తిరుమల రెండో ఘాట్ రోడ్డు ఎలా మారిపోయిందో చూడండి!

  • చిత్తూరు జిల్లాను ముంచెత్తిన వానలు
  • తిరుపతి, తిరుమలలో కుండపోత
  • భారీగా విరిగిపడుతున్న కొండచరియలు
  • పరిశీలించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
కుండపోత వానలు ఇటీవల చిత్తూరు జిల్లాను అతలాకుతలం చేశాయి. తిరుపతి నగరంతో పాటు తిరుమల కొండపైనా వర్ష బీభత్సం కొనసాగింది. శ్రీవారి మెట్టు మార్గంపై కూడా వరద నీరు ప్రవహించింది. కొండచరియలు తీవ్రస్థాయిలో విరిగిపడ్డాయి. ఈ ఉదయం కూడా రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. గతంలో కొండచరియలు విరిగిపడినప్పుడు రోడ్డుకు భారీ స్థాయిలో నష్టం జరిగిన దాఖలాలైతే లేవు.

కానీ ఇవాళ విరిగిపడిన కొండచరియల ధాటికి రోడ్డు తుత్తునియలైంది. ఒక వైపు భాగమంతా లోయలోకి జారిపోయింది. ఏదైనా వాహనాలు వచ్చే సమయంలో ఆ కొండచరియలు విరిగిపడుంటే ఏం జరిగేదో ఊహించడానికే భయం కలిగేలా విజువల్స్ ఉన్నాయి.

కాగా, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. గత 3 దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత వర్షపాతం ఈసారి నమోదైందని వెల్లడించారు. దాంతో తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విపరీతంగా విరిగిపడుతున్నాయని తెలిపారు. కొండపైకి వచ్చే అప్ ఘాట్ రోడ్డులో ఐదారు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రదేశాలను గుర్తించామని, యుద్ధ ప్రాతిపదికన ధ్వంసమైన రోడ్డు మరమ్మతు పనులు చేస్తున్నామని వివరించారు.

కొండచరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో ఢిల్లీ ఐఐటీ నిపుణులు ఈ సాయంత్రానికి తిరుమల చేరుకుంటారని, టీటీడీ ఇంజినీరింగ్, విజిలెన్స్ అధికారులతో కలిసి వారు ఘాట్ రోడ్డుల పరిశీలన చేస్తారని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. కొండచరియలు విరిగిపడకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేసి, రెండు మూడ్రోజుల్లో నివేదిక సమర్పిస్తారని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.


More Telugu News