ఒమిక్రాన్ కలకలం.. ఆఫ్రికా నుంచి వచ్చిన వందలాది మంది అడ్రస్ లేరు!

  • ముంబైకి ఇటీవల వెయ్యి మంది రాక
  • కేవలం 466 మందే గుర్తింపు
  • బీహార్ కు వచ్చిన 281 మందిలో జాడ లేని వంద మంది 
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో.. ఆఫ్రికా దేశాల నుంచి భారత్ కు వచ్చిన వారి ఆచూకీ తెలియకుండా పోయింది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసులు నమోదు కాకపోయినా.. వారి జాడ తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 15 రోజుల్లో వందలాది మంది దేశంలో దిగినా.. దాంట్లో సగం మంది వారివారి పాస్ పోర్టుల్లో పేర్కొన్న చిరునామాల్లో మాత్రం లేరు. దీంతో వారి ద్వారా ఈ కొత్త వేరియంట్ దేశంలో విస్తరించే ముప్పుంటుందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ముంబైకి ఈ 15 రోజుల్లో వెయ్యి మందికిపైగా రాగా.. అందులో కేవలం 466 మందినే గుర్తించినట్టు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. మిగతా వారి ఆచూకీ లేదు. బీహార్ కు 281 మంది వస్తే.. అందులో వంద మంది అడ్రస్ జాడే లేదు. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

వచ్చినవారికి వచ్చినట్టే టెస్టులు చేసేందుకు కేరళ ఆరోగ్య శాఖ.. విమానాశ్రయాల్లో అధికారులు, సిబ్బందిని మోహరించింది. నాలుగు విమానాశ్రయాల్లో సిబ్బందిని పెట్టామని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అటు ఇటీవల సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినా.. అది ఏ వేరియంట్ అన్నది ఇంకా తెలియరాలేదు. దానికి సంబంధించిన జన్యుక్రమ విశ్లేషణ ఇంకా కొనసాగుతోంది.


More Telugu News