తొలి పాటకే నంది అవార్డు అందుకున్న మహానుభావుడు.. సిరివెన్నెల మహాప్రస్థానం ఇదే!

  • 1955లో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సిరివెన్నెల
  • 'సిరివెన్నెల' చిత్రంతో ఆయనకు తొలి అవకాశం ఇచ్చిన కె.విశ్వనాథ్
  • పద్మశ్రీతో పాటు, 11 సార్లు నంది అవార్డు అందుకున్న సిరివెన్నెల
'ఆది భిక్షువు వాడు.. వాడినేమి అడిగేది?', 'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని'... ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు ఆయన కలం నుంచి జాలువారాయి. దాదాపు 3 వేలకు పైగా ఆయన రాసిన పాటలు... ప్రతి ఒక్కటీ అందరి హృదయాలను తాకాయి. ఆయనే ప్రముఖ సినీ గేయ రచయిత, కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న సిరివెన్నెల అందరినీ శోకసంద్రంలో ముంచుతూ కాసేపటి క్రితం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఆయన అసలు పేరు చెంబోలు సీతారామశాస్త్రి. 1955 మే 20న విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలో సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు ఆయన జన్మించారు. ఆయనది దిగువ మధ్యతరగతి కుటుంబం. పదవ తరగతి వరకు అనకాపల్లిలో చదివిన సిరివెన్నెల.. కాకినాడలో ఇంటర్, ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో బీఏ పూర్తి చేశారు. 10వ తరగతి అర్హతపై బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగం రావడంతో రాజమండ్రిలో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. సీతారామశాస్త్రిలో మంచి కవి ఉన్నాడనే విషయాన్ని తొలుత ఆయన సోదరుడు గుర్తించారు. ఆ తర్వాత ఏవీ కృష్ణారావు, చాగంటి శరత్ బాబులతో కలిసి సాహితీ సభలకు వెళ్లేవారు.

ఎంఏ చదువుతుండగా దర్శకుడు కె.విశ్వనాథ్ నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. 'సిరివెన్నెల' చిత్రానికి పాట రాసే అవకాశాన్ని సిరివెన్నెలకు విశ్వనాథ్ ఇచ్చారు. 'విధాత తలపున' గేయంతో తన సినీ ప్రస్థానాన్ని సిరివెన్నెల చాలా ఘనంగా ఆరంభించారు. 800లకు పైగా చిత్రాల్లో ఆయన 3 వేలకు పైగా పాటలు రాశారు. ఆయన రాసిన పాటలన్నీ సీనీ అభిమానులను మంత్రముగ్ధులను చేశాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినీ పరిశ్రమకు సిరివెన్నెల చేసిన సేవలకు గాను ఆయనను 2019లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.

తాను రాసిన తొలిపాట 'విధాత తలపున'కే నంది అవార్డును సొంతం చేసుకున్న ఘనత ఆయన సొంతం. తన కెరీర్ లో మొత్తం 11 సార్లు నంది అవార్డులను ఆయన అందుకున్నారు. ఇక ఇతర పురస్కారాలకు లెక్కే లేదు. ఆయన మృతితో సినీ కళామతల్లి ఓ ముద్దు బిడ్డను కోల్పోయింది. సినీ పరిశ్రమ, ఇరు తెలుగు రాష్ట్రాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.


More Telugu News