డాలర్ శేషాద్రి హఠాన్మరణం.. స్వామి స్వరూపానంద స్పందన

  • తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన డాలర్ శేషాద్రి
  • నిత్యం శ్రీవారి పాదాల చెంతనే జీవించారన్న స్వరూపానంద
  • ఆయన మహా విష్ణువు హృదయంలోకి చేరుకోవాలని ఆకాంక్ష
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఈ తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డాలర్ శేషాద్రితో తనకు సుదీర్ఘకాలంగా సాన్నిహిత్యం ఉందని చెప్పారు. తిరుమల వెంకన్నను దర్శించుకునే ప్రతి భక్తుడికి ఆయన సుపరిచితుడని అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆదరాభిమానాలను పొందిన గొప్ప మనిషి శేషాద్రి అని చెప్పారు. శేషాద్రి నిత్యం శ్రీవారి పాదాల చెంతనే జీవించారని... ఇంతటి అదృష్టం అందరికీ దొరకదని అన్నారు. ఆయన మరణం తనను కలచి వేసిందని చెప్పారు. డాలర్ శేషాద్రి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన ఆత్మ శాంతించాలని... ఆయన మహా విష్ణువు హృదయంలోకి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.

డాలర్ శేషాద్రి తనకు ప్రాణ సమానుడని టీటీడీ మాజీ ఈవో శ్రీనివాసరాజు అన్నారు. లక్షలాది మందికి ఆయన ప్రీతిపాత్రుడని చెప్పారు. శ్రీవారికి ఆయన చేసిన సేవలు చిరకాలం నిలిచిపోతాయని అన్నారు. 50 ఏళ్లగా స్వామివారికి ఆయన సేవలు అందించారని తెలిపారు. ఆయన మరణం తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పారు.


More Telugu News