ఢిల్లీలో ముగిసిన అఖిలపక్ష సమావేశం... వివరాలు తెలిపిన వైసీపీ, టీడీపీ ఎంపీలు

  • రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
  • నవంబరు 29 నుంచి డిసెంబరు 23 వరకు సమావేశాలు
  • నేడు ఢిల్లీలో అఖిలపక్షం నిర్వహణ
  • హాజరైన వైసీపీ, టీడీపీ ఎంపీలు
పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడారు.

అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించేలా చూడాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదని అఖిలపక్షంలో చెప్పామని తెలిపారు. ఏకీకృత నిబంధన తీసుకురావడం ద్వారా దేశమంతా ఒకే ధర అమలయ్యేలా చూడాలని సూచించామని టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. విశాఖ ఉక్కు, ఇతర సంస్థల ప్రైవేటీకరణ వద్దని కోరామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఒమిక్రాన్ కరోనా వేరియంట్ పైనా చర్చించారని తెలిపారు.

అటు, వైసీపీ ఎంపీ విజయసాయి అఖిలపక్షం భేటీపై స్పందించారు. కనీస మద్దతు ధర చట్టం తేవాలని అఖిలపక్ష భేటీలో కోరామని చెప్పారు. ఏపీలో 24 పంటలకు మద్దతు ధర ఇస్తున్నామని చెప్పామని వివరించారు. దేశవ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలని కోరామని తెలిపారు. కనీస మద్దతు ధరపై పార్లమెంటరీ సంయుక్త సంఘం వేయాలని కోరామని అన్నారు. ఆహార భద్రత చట్టంలో ఏపీకి జరిగిన అన్యాయం సరిదిద్దాల్సి ఉందని విజయసాయి స్పష్టం చేశారు.

అణగారిన బీసీల గుర్తింపు కోసం సామాజిక, ఆర్థిక కులగణన చేయాలని తెలిపారు. మహిళా రిజర్వేషన్, దిశ బిల్లు ఆమోదించాలని విజ్ఞప్తి చేసినట్టు వివరించారు. అటు, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు ఇప్పించాలని కూడా కోరామని వెల్లడించారు. తెలంగాణ బకాయిలు చెల్లించకుంటే కేంద్రమే భరించాలని స్పష్టం చేశామని చెప్పారు.


More Telugu News