కొత్త వేరియంట్ ప్రకంపనలు... దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటనపై నీలి నీడలు

  • దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ వ్యాప్తి
  • డిసెంబరు 17 నుంచి దక్షిణాఫ్రికాలో టీమిండియా టూర్
  • మ్యాచ్ వేదికల్లో కరోనా కేసులు
  • కేంద్రం నిర్ణయం కోసం చూస్తున్న బీసీసీఐ
ఆఫ్రికా దేశాల్లో వ్యాపిస్తున్న బి.1.1.529 కరోనా కొత్త వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధానంగా ఈ వేరియంట్ దక్షిణాఫ్రికాలో ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటికే ఈ కొత్త రకం కరోనాతో దక్షిణాఫ్రికాలో 100కి పైగా కేసులు నమోదయ్యాయి. దీని ప్రభావం ఇప్పుడు క్రికెట్ పైనా పడింది. డిసెంబరు 17 నుంచి 2022 జనవరి 26 వరకు భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది. కానీ కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో టీమిండియా టూర్ పై అనిశ్చితి నెలకొంది.

ఇది ఆటగాళ్ల ఆరోగ్య భద్రతకు సంబంధించిన అంశం కావడంతో ఈ విషయాన్ని కేంద్రం నిర్ణయానికే వదిలివేయాలని బీసీసీఐ భావిస్తోంది. కేంద్రం నిర్ణయం చెబితే, ఆపై దక్షిణాఫ్రికాలో పరిస్థితుల పట్ల అక్కడి క్రికెట్ బోర్డు వర్గాలతో చర్చిస్తామని బీసీసీఐ అధికారులు అంటున్నారు. టీమిండియా ఆడే మ్యాచ్ లకు సెంచూరియన్, జోహాన్నెస్ బర్గ్ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడమే బీసీసీఐ ఆందోళనకు కారణం.

ప్రస్తుతం న్యూజిలాండ్ తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతున్న టీమిండియా డిసెంబరు రెండో వారంలో దక్షిణాఫ్రికా బయల్దేరాల్సి ఉంది. కొత్త వేరియంట్ కారణంగా అనేక దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో క్రికెట్ పర్యటనపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.


More Telugu News