వైసీపీ ఎంపీలతో ముగిసిన సీఎం జగన్ సమావేశం

  • ఈ నెల 29 నుంచి పార్లమెంటు సమావేశాలు
  • వైసీపీ ఎంపీలతో సీఎం జగన్ భేటీ
  • పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
  • భేటీ వివరాలు వెల్లడించిన విజయసాయి
ఏపీ సీఎం జగన్ వైసీపీ ఎంపీలతో నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ భేటీ అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైసీపీకి ప్రత్యేక సిద్ధాంతం ఉందని, తమ పార్టీ ఏ కూటమిలోనూ లేదని స్పష్టం చేశారు. ప్రజాసమస్యలపైనే పోరాడాలని తమకు సూచించారని వెల్లడించారు.

రెవెన్యూ లోటుపై పార్లమెంటులో ప్రస్తావించాలని తెలిపారని వెల్లడించారు. 2014 నుంచి చూస్తే రాష్ట్రానికి రూ.22,940 కోట్ల రెవెన్యూ లోటు ఉందని విజయసాయి తెలిపారు. అటు, పోలవరంపై కేంద్రం వైఖరిని కూడా పార్లమెంటులో లేవనెత్తాలని సీఎం జగన్ నిర్దేశించారని వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు అంశాల వారీగా అనుమతులు సరికాదన్న విషయాన్ని ఉభయ సభల్లో వివరించాలని, డిజైన్ల అనుమతి, నిధుల మంజూరుపై ప్రశ్నించాలని సీఎం స్పష్టం చేశారని విజయసాయి వెల్లడించారు.

ఈ నెల 29 నుంచి డిసెంబరు 23 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన పంథాపై నేటి సమావేశంలో వైసీపీ ఎంపీలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.


More Telugu News