టీ20 ప్రపంచకప్‌లో రికార్డులకెక్కిన భారత్-పాక్ మ్యాచ్

  • ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబరు 24న మ్యాచ్
  • భారత్‌లో అత్యధిక మంది వీక్షించిన మ్యాచ్‌గా రికార్డు
  • ప్రపంచవ్యాప్తంగా 10 వేల గంటలకు పైగా లైవ్ కవరేజీ
  • 2016 నాటి భారత్-విండీస్ సెమీస్ మ్యాచ్ రికార్డు బద్దలు
  • ఆస్ట్రేలియాలో 175 శాతం అధిక వీక్షణలు
చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్లు ఏ స్థాయిలో, ఎక్కడ తలపడినా ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకిస్తుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. ఎవరు గెలిచినా సరిహద్దుల్లోని జవాన్లు సంబరాలు జరుపుకుంటారు. అందుకే ఈ రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్‌లకు అంత ప్రత్యేకత. 

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబరు 24న దుబాయ్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ రికార్డులకెక్కింది. భారత్‌లో అత్యధికంగా వీక్షించిన మ్యాచ్‌గా ఇది చరిత్ర సృష్టించింది. మన దేశంలో స్టార్ ఇండియా నెట్‌వర్క్‌లో ఏకంగా 15.9 బిలియన్ నిమిషాలపాటు ఈ మ్యాచ్‌ను వీక్షించినట్టు ఐసీసీ తాజాగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 10 వేల గంటలు లైవ్ కవరేజీ చేసినట్టు తెలిపింది. 2016 టీ20 ప్రపంచకప్‌లో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన సెమీస్‌ను అత్యధికమంది వీక్షించగా ఇప్పుడా రికార్డు బద్దలైంది.

ఇదే మ్యాచ్‌ను ఇంగ్లండ్‌లో స్కై యూకే నెట్‌వర్క్ ప్రసారం చేయగా 60 శాతం ఎక్కువ మంది ఈ మ్యాచ్‌ను వీక్షించారు. పాకిస్థాన్‌లో పీటీవీ, ఏఆర్‌వై, టెన్‌స్పోర్ట్స్‌లు ప్రసారం చేయగా 7.3 శాతం మంది అధికంగా వీక్షించారు. ఆస్ట్రేలియాలో అయితే ఫాక్స్ నెట్‌వర్క్‌లో ఏకంగా 175 శాతం అధిక వీక్షణలు లభించినట్టు ఐసీసీ వివరించింది. అమెరికాలోనూ ఈ మ్యాచ్‌కు విశేష ఆదరణ లభించింది. ఈఎస్‌పీఎన్‌లో ప్రసారమైన భారత్-పాక్ మ్యాచ్‌ను గతంలో ఎన్నడూ లేనంతగా చూశారు.

ఫేస్‌బుక్‌లోనూ ఈ లీగ్ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ లభించాయి. 2019 వన్డే ప్రపంచకప్‌లో 3.6 బిలియన్ వ్యూస్ లభించగా, ఈ మ్యాచ్‌ ఆ రికార్డును బద్దలు చేస్తూ 4.3  బిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఐసీసీ సామాజిక మాధ్యమాల ద్వారానూ అత్యధికమంది తిలకించారు. 618 మిలియన్ల మంది ఈ మ్యాచ్‌ను వీక్షించినట్టు ఐసీసీ వివరించింది.


More Telugu News