పాక్ క్రికెటర్ల వీర దేశభక్తి... బంగ్లాదేశ్ కోర్టులో దావా

  • బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్న పాక్ క్రికెట్ జట్టు
  • ప్రాక్టీసు సందర్భంగా తమ దేశ జెండా ఎగురవేసిన పాక్ ఆటగాళ్లు
  • తీవ్ర ఆగ్రహానికి గురైన బంగ్లాదేశ్ జాతీయులు
  • తమను రెచ్చగొట్టే రాజకీయ చర్య అంటూ ఆగ్రహం
బాబర్ అజామ్ నాయకత్వంలోని పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పర్యటిస్తోంది. అయితే అనూహ్యరీతిలో ఆ జట్టు వివాదంలో చిక్కుకుంది. మిర్పూర్ లో ప్రాక్టీసు చేస్తున్న సందర్భంగా పాకిస్థాన్ జట్టు మైదానంలో తమ దేశ జెండా ఎగురవేసింది. సాధారణంగా మ్యాచ్ ముందు ఆయా దేశాల జెండాలు ఎగురవేయడం తెలిసిందే. అయితే ప్రాక్టీసు సందర్భంగా పాకిస్థాన్ జట్టు వారి దేశ జెండాను ఎగురవేయడం పట్ల బంగ్లాదేశీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

త్వరలోనే బంగ్లాదేశ్ గోల్డెన్ జూబ్లీ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోనున్న తరుణంలో తమను రెచ్చగొట్టేందుకే పాక్ ఆటగాళ్లు వారి జెండా ప్రదర్శించారని, ఇది రాజకీయ పరమైన చర్య అని బంగ్లాదేశ్ కోర్టులో కొందరు దావా వేశారు. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ సహా 21 మందిపైనా ఫిర్యాదు చేశారు.

అనేక విదేశీ జట్లు బంగ్లాదేశ్ వస్తుంటాయని, ఇక్కడ పర్యటించి అనేక మ్యాచ్ లు ఆడుతుంటాయని వారు తెలిపారు. కానీ పాకిస్థాన్ లాగా ఏ జట్టు కూడా మైదానంలో జాతీయ జెండా పాతి ప్రాక్టీసు చేయడం తాము చూడలేదని వారు వివరించారు. దీనిపై పాక్ జట్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. బంగ్లాదేశ్... 1971లో పాకిస్థాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే.


More Telugu News