ఆ ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కింది.. మండిపడిన టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల

  • అక్రమ కేసులపై కోర్టుల్లోనే తేల్చుకుంటాం
  • ఇసుకను రూ.11 వేలు చేసిన ఘనత సీఎందే
  • రాష్ట్రమంతా గంజాయి, సారా దొరుకుతోంది
  • చెత్త పన్ను అంటూ కొత్త పన్ను వేశారు
  • అమ్మ ఒడిలో రూ.15 వేలని చెప్పి వెయ్యి కోశారు
  • రాజమండ్రి రూరల్ నియోజకవర్గ సమావేశంలో కామెంట్లు
రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. వాటిపై కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పారు. అక్రమ కేసులెన్ని పెట్టినా పార్టీకి అండగా చాలా మంది కార్యకర్తలున్నారన్నారు. ఇవాళ పార్టీ రాజమండ్రి గ్రామీణం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. అమ్మ ఒడి పథకం ద్వారా తల్లి ఖాతాలో రూ.15 వేలు వేస్తామని చెప్పి ఇప్పుడు అందులో రూ.వెయ్యి కోత పెట్టారని విమర్శించారు.

అది కూడా కుటుంబంలో ఒక్క విద్యార్థికే ఇస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించట్లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లుంటే.. కేవలం 1.8 లక్షల మందికే రూ.10 వేలు ఇచ్చారన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి నెలకు రూ.4 వేలు అదనంగా వారి నుంచే వసూలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చలానాల రూపంలో పోలీసులూ మరికొంత వారి నుంచి తీసుకుంటున్నారన్నారు.


ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల రుణాలను ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో రోడ్లు గుంతలు పడినా మరమ్మతులు చేయట్లేదన్నారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు సరిగ్గా బిల్లులనూ చెల్లించడం లేదని ఆయన విమర్శించారు. కరెంటు బిల్లులు, ఇంటి పన్నులనూ పెంచారని ఆరోపించారు. చెత్త పన్ను అంటూ కొత్త పన్ను వేశారన్నారు. రాష్ట్రమంతటా గంజాయి, సారా దొరుకుతోందని అన్నారు. చంద్రబాబు హయాంలో రూ.2,600 ఉన్న టన్ను ఇసుక.. ఇప్పుడు రూ.11 వేలకు పెంచారని పేర్కొన్నారు. ఆ ఘనత కేవలం జగన్ మోహన్ రెడ్డికే దక్కిందన్నారు.


More Telugu News