మమతను పొగిడి.. మోదీపై దుమ్మెత్తిపోసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి

  • మోదీ ప్రభుత్వం అన్నింటిలోనూ ఫెయిల్
  • చైనా మన భూభాగాన్ని దోచుకుంటున్నప్పుడు ప్రభుత్వం నిద్రపోతోంది
  • మోదీకి ఆర్థికశాస్త్రం తెలియదు
  • మమత చెప్పేదే చేస్తారు.. చేసేదే చెబుతారు
  • రాజకీయాల్లో ఇలాంటి గుణం చాలా అరుదు
రాజకీయాల్లో ఎవరికీ అంతుబట్టని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి మాత్రమే. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. తాజాగా, సొంత ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు మరోమారు సంచలనమయ్యాయి. మోదీ ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఇది, అది అని కాదని, అన్నింటిలోనూ మోదీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని నేడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసిన తర్వాతి రోజే ఆయనీ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు భద్రత, విదేశీ వ్యవహారాలు, అంతర్గత భద్రత వంటి విషయాల్లో మోదీ ప్రభుత్వం విఫలమైందన్న సుబ్రహ్మణ్యస్వామి.. ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభ విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరును ‘అపజయం’గా అభివర్ణించారు. అలాగే, పెగాసస్ డేటా భద్రతా ఉల్లంఘన విషయంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.  

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై సుబ్రహ్మణ్యస్వామి బుధవారం ప్రశంసలు కురిపించారు. ఆమెను జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, చంద్రశేఖర్, పీవీ నరసింహారావు వంటి రాజకీయ దిగ్గజాలతో పోల్చారు. ఆమె చెప్పిందే చేస్తారని, చేసేదే చెబుతారంటూ పొగడ్తలు కురిపించారు. రాజకీయాల్లో ఇలాంటి గుణం చాలా అరుదని కీర్తించారు.

సుబ్రహ్మణ్యస్వామి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘మన అణ్వాయుధానికి చైనా భయపడకపోతే, వారి అణ్వాయుధానికి మనం ఎందుకు భయపడుతున్నాం?’’ అంటూ ఈ నెల 23న ట్వీట్ చేశారు. అంతకుముందు ధరల పెరుగుదలపై ఓ ట్విట్టర్ యూజర్‌ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయనకు (పీఎం మోదీకి) ఆర్థికశాస్త్రం తెలియదని అన్నారు.

మోదీ ప్రభుత్వం పట్టనట్టుగా ఉందని, విదేశీ వ్యవహారాలు, జాతీయ భద్రత విషయంలో భారతదేశ పరిస్థితి ఏమంత బాగోలేదన్నారు. చైనా మన భూభాగాన్ని దోచుకుంటున్నప్పుడు ప్రభుత్వం నిద్రపోతోందని విమర్శించారు. భారతమాతను అణగదొక్కిన ఈ వ్యక్తులు చైనాను దురాక్రమణదారు అని పిలవడానికి ఇష్టపడడం లేదని స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News