‘అమ్మఒడి’పై మండలిలో ప్రశ్నల వర్షం కురిపించిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం

  • నాన్న తాగడం ద్వారానే అమ్మఒడి డబ్బులు వచ్చాయని చెబుతారా?
  • ఈ రెండున్నరేళ్లలో మద్యం తాగేవారి సంఖ్య కానీ, వారి ఖర్చు కానీ తగ్గిందా.
  • రూ. 500 సంపాదిస్తే రూ. 400 తాగడానికేనన్న మరో ఎమ్మెల్సీ
  • చిత్రవిచిత్రంగా ఉన్న మద్యం బ్రాండ్ల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయన్న ఎమ్మెల్సీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం ‘అమ్మఒడి’పై ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రశ్నల వర్షం కురిపించారు. ‘రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్’ చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. నాన్న తాగడం ద్వారానే అమ్మఒడి డబ్బులు వచ్చాయని చెబుతారా? మద్యం తాగితేనే అమ్మఒడి ఇస్తారా? ఎక్కువ సంక్షేమం ఉంది కాబట్టి ఎక్కువ తాగమని చెబుతారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

మద్యం ఆదాయంతోనే అమ్మఒడి ఇస్తామంటే బడులకు వెళ్లినప్పుడు ఎలా ఉంటుందని నిలదీశారు. తాగిన దాంట్లోనుంచే అమ్మఒడి డబ్బులు వచ్చాయంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దశల వారీగా మద్యాన్ని నియంత్రిస్తామన్నారని, ఈ రెండున్నరేళ్లలో తాగే వారి సంఖ్య తగ్గిందా? వారి ఖర్చు తగ్గిందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎప్పటికైనా ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవడం ఖాయమన్నారు.

మద్యం ధరలు పెంచడంతో పేదలు కూలికి వెళ్తే వచ్చే రూ. 500ల్లో రూ. 400 తాగేందుకే ఖర్చు చేస్తున్నారని పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ చర్యలు పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. చిత్రవిచిత్రంగా ఉన్న మద్యం బ్రాండ్ల పేర్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయన్నారు.


More Telugu News