రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి కుర్రకారును ఉర్రూతలూగించే కాన్సెప్ట్ బైక్
- కొత్త తరం బైక్ తయారుచేసిన రాయల్ ఎన్ ఫీల్డ్
- యువతను ఆకట్టుకునేలా డిజైన్
- రిచ్ నెస్ ఉట్టిపడేలా ఉన్న ఎస్జీ 650
- మిలాన్ ఎక్స్ పోలో బైక్ ఆవిష్కరణ
రాయల్ ఎన్ ఫీల్డ్... అనేక దశాబ్దాలుగా ద్విచక్రవాహన రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని ముందుకు సాగుతున్న సంస్థ. ముఖ్యంగా బుల్లెట్ బండితో రాయల్ ఎన్ ఫీల్డ్ భారతీయుల మదిని దోచింది. డుగ్ డుగ్ డుగ్ అంటూ బుల్లెట్ వెళుతుంటే ఆ రాజసమే వేరు! అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా రాయల్ ఎన్ ఫీల్డ్ కూడా కొత్త మోడల్ బైకులు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో 'ఎస్జీ 650' పేరిట ట్విన్ కాన్సెప్ట్ బైకును తీసుకువస్తోంది.
ఈ నయా బైక్ ను ఇటలీలోని మిలాన్ నగరంలో తాజాగా ప్రారంభమైన ఇంటర్నేషనల్ మోటార్ సైకిల్ అండ్ యాక్సెసరీస్ ఎగ్జిబిషన్ లో ఆవిష్కరించింది. డిజిటల్ యుగానికి దీటుగా తన కొత్త బైకును రాయల్ ఎన్ ఫీల్డ్ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసింది. రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ బైక్ మోడల్ ను ప్రాతిపదికగా తీసుకుని 'ఎస్జీ 650'కి రూపకల్పన చేసినట్టు చీఫ్ డిజైనర్ మార్క్ వెల్స్ తెలిపారు.
ఈ బైక్ తయారీలో పాలిష్డ్ అల్యూమినియం ఉపయోగించారు. ఫ్రంట్ ఎండ్ చూస్తే రిచ్ నెస్ ఉట్టిపడేలా రూపొందించారు. యువత అభిరుచులను దృష్టిలో ఉంచుకుని ఫ్యూయల్ టాంక్ పై డిజిటల్ గ్రాఫిక్స్ ను పొందుపరిచారు. తద్వారా ఫ్యూచర్ బైక్ రేసులో తాము కూడా ఉన్నామని రాయల్ ఎన్ ఫీల్డ్ చాటిచెప్పింది.
సింగిల్ సీట్, డ్యూయెల్ సైలెన్సర్లతో ఉన్న ఈ బండి వేగంలో మొనగాడు అని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ ఏబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్ తో కూడిన వీల్ రిమ్ములు ఎస్జీ 650కి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ కాన్సెప్ట్ బైక్ ద్వారా ప్రీమియం క్రూయిజర్ బైక్ సెగ్మెంట్లో తాను కూడా ఉన్నానని రాయల్ ఎన్ ఫీల్డ్ సంకేతాలు పంపింది. త్వరలోనే ఈ బైక్ ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయనున్నారు.