రాష్ట్ర ప్రజల ఆశీస్సులే అండగా నిలిచాయి: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్

  • ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన గవర్నర్ 
  • సతీసమేతంగా హైదరాబాద్ నుంచి విజయవాడ రాక
  • స్వాగతం పలికిన రాజ్ భవన్ వర్గాలు
  • కరోనా పట్ల అశ్రద్ధ కూడదన్న గవర్నర్
కరోనా నుంచి కోలుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు హైదరాబాదు ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ మధ్యాహ్నం ఆయన విజయవాడ రాజ్ భవన్ కు చేరుకున్నారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా రాజ్ భవన్ లో గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజల ఆశీస్సులు, వైద్యుల సేవల ఫలితంగానే త్వరితగతిన కోలుకున్నానని వివరించారు.

వాక్సిన్ ఎంతో ఉపయోగపడిందని, సకాలంలో రెండు డోసుల వాక్సిన్ తీసుకోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదురుకాలేదన్నారు. రాష్ట్ర ప్రజలు కరోనా విషయంలో జాగ్రత్త వహించాలని, తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఎటువంటి అశ్రద్ధ కూడదని పేర్కొన్నారు. తప్పనిసరిగా మాస్కును ధరించటం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవటం, సామాజిక దూరాన్ని పాటించటం వంటివి మరి కొంతకాలం కొనసాగించాలని గవర్నర్ పిలుపునిచ్చారు.


More Telugu News