జగన్ అక్రమాస్తుల కేసు.. కుట్ర కోణం ఆరోపణలు అవాస్తవమన్న బ్రహ్మానందరెడ్డి

  • వాన్‌పిక్ కేసు నుంచి తనను తప్పించాలంటూ బ్రహ్మానందరెడ్డి డిశ్చార్జ్ పిటిషన్
  • కుట్ర పన్నేందుకు నిందితులను తాను ఎప్పుడూ కలవలేదన్న బ్రహ్మానందరెడ్డి
  • తనపై మోపిన 22 అభియోగాల్లో ఏ ఒక్క దానికీ ఆధారాలు లేవన్న పిటిషనర్
  • నేడు కూడా కొనసాగనున్న వాదనలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఆర్ఏఎస్ మాజీ అధికారి బ్రహ్మానందరెడ్డి తనపై ఉన్న కుట్ర కోణం ఆరోపణలు నిజం కాదని తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో వాన్‌పిక్ కేసు నుంచి  తనను తప్పించాలన్న డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ బ్రహ్మానందరెడ్డి రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టగా బ్రహ్మానందరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది వినోద్ దేశ్‌పాండే వాదనలు వినిపించారు.

కుట్ర పన్నేందుకే బ్రహ్మానందరెడ్డి నిందితులను కలిసినట్టు సీబీఐ చెబుతున్న దాంట్లో నిజం లేదన్నారు. కుట్ర పన్నడానికి నిందితులను పిటిషనర్ ఎప్పుడూ కలవలేదన్నారు. అలాగే, అవినీతి నిరోధక చట్టం కింద కూడా కేసులు నమోదు చేసిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. ఈ విషయంలో బ్రహ్మానందరెడ్డి వ్యక్తిగత ప్రయోజనాలు పొందినట్టు ఎలాంటి ఆరోపణలు లేవన్నారు.

వాన్‌పిక్ ప్రాజెక్టులో నిందితుడైన ఆ శాఖ అప్పటి ముఖ్యకార్యదర్శి మన్మోహన్‌సింగ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారని, ఆయన మంత్రి మండలికి నివేదించారని పేర్కొన్నారు. తన క్లయింటుపై మొత్తం 22 అభియోగాలు మోపారని, వీటిలో ఏ ఒక్క దానికీ ఆధారాలు లేవని వినోద్ దేశ్‌పాండే కోర్టుకు తెలిపారు. మంత్రి మండలి ఆమోదించిన రాయితీ ఒప్పందానికి, బ్రహ్మానందరెడ్డి సంతకం చేసిన రాయితీ ఒప్పందానికి మధ్య ఎలాంటి తేడా లేదని స్పష్టం చేశారు. కాగా, నేడు కూడా దీనిపై వాదనలు కొనసాగనున్నాయి.


More Telugu News