తల్లి లాంటి భువనేశ్వరికి అవమానం జరిగితే కేటీఆర్ స్పందించకపోవడం బాధాకరం: కొండా సురేఖ

  • ఏపీ అసెంబ్లీలో తన భార్యను దూషించారన్న చంద్రబాబు
  • పార్టీలకు అతీతంగా చంద్రబాబుకు మద్దతు
  • ఈ ఘటనపై స్పందించిన కొండా సురేఖ
  • దేశం మొత్తం ఖండించాలని పిలుపు
  • దీనిపై వైఎస్ షర్మిల కూడా స్పందించాలని సూచన
ఏపీ అసెంబ్లీలో తన కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు దారుణ రీతిలో అవమానించారని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర మనస్తాపానికి గురవడం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ నేత కొండా సురేఖ స్పందించారు. ఏపీ అసెంబ్లీ ఘటనను దేశం మొత్తం ఖండించాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మంచిది కాదని హితవు పలికారు. ఇటువంటి ఘటనలపై పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు గళం విప్పాలని అన్నారు.

ఈ ఘటనపై వైఎస్ షర్మిల కూడా స్పందించాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఘటనపై కవిత స్పందించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. తల్లి లాంటి మహిళకు అవమానం జరిగినా కేటీఆర్ కనీసం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. కనీసం ట్విట్టర్ లోనైనా ఖండించాల్సిందని అభిప్రాయపడ్డారు.

కాగా, ఈ అంశంలో రోజా, లక్ష్మీపార్వతి స్పందించిన తీరు తనను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు. సాటి మహిళకు అవమానం జరిగిన వేళ రోజా శాపనార్థాలు పెట్టడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. లక్ష్మీపార్వతి మాటలు విన్నాక ఆమెపై ఉన్న గౌరవం కాస్తా తొలగిపోయిందని కొండా సురేఖ స్పష్టం చేశారు. రాజకీయాలు పార్టీల వరకే పరిమితం కావాలని, కుటుంబాల వరకు తీసుకుపోవద్దని సూచించారు.


More Telugu News