కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తుందనే బిల్లును వెనక్కి తీసుకున్నారు: సోము వీర్రాజు

  • వికేంద్రీకరణ బిల్లు వాపసు తీసుకున్న ప్రభుత్వం
  • సీఆర్డీయే రద్దు నిర్ణయం ఉపసంహరణ 
  • జగన్ గతంలో అమరావతిలోనే రాజధాని అన్నారన్న సోము
  • అదే మాటకు కట్టుబడి ఉండాలని సూచన
వికేంద్రీకరణ అంశంపై కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తుందనే బిల్లు వెనక్కి తీసుకున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శనాస్త్రాలు సంధించారు. అధికార వికేంద్రీకరణ వారి సొత్తు కాదు అని స్పష్టం చేశారు. వికేంద్రీకరణ బీజేపీ కూడా చేసిందని, కొత్త రాష్ట్రాలు తీసుకువచ్చిందని వివరించారు. ఒక విధానం ప్రకారం బీజేపీ వికేంద్రీకరణ చేపట్టిందని తెలిపారు. కానీ, రోడ్డుపై గోతులు పూడ్చలేని వారు అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నా, ఇక్కడే రాజధాని అని సీఎం జగన్ గతంలో చెప్పిన మాటకు సమాధానం ఇవ్వాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. తాను చెప్పిన మాటకు జగన్ కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణపై మాట్లాడే హక్కు జగన్ కు లేదని అన్నారు. విశాఖను ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. రాజధానులపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అన్ని పార్టీలతో చర్చించాలని, ప్రజాభిప్రాయం సేకరించాలని హితవు పలికారు.


More Telugu News