విదర్భ క్రికెటర్ దర్శన్ నల్కండే సంచలనం.. డబుల్ హ్యాట్రిక్ సాధించిన రెండో ఇండియన్‌గా రికార్డు.. వీడియో వైరల్!

  • సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ రెండో సెమీస్‌లో ఘటన
  • నాలుగు బంతుల్లో నలుగురిని పెవిలియన్ పంపిన దర్శన్ 
  • ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ అభిమన్యు మిథున్
  • అంతర్జాతీయ క్రికెట్‌లో లసిత్ మలింగ పేరుపై రికార్డు
భారత క్రికెట్ టీ20 చరిత్రలో మరో అద్భుత రికార్డు నమోదైంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలో నిన్న కర్ణాటకతో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో విదర్భ పేసర్ దర్శన్ నల్కండే అరుదైన రికార్డు సృష్టించాడు. వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. ఫలితంగా ఆ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.

కర్ణాటక ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన దర్శన్ బంతితో చెలరేగిపోయాడు. రెండో బంతికి అనిరుద్ధ జోషి (1)ని అవుట్ చేసిన దర్శన్.. మూడో బంతికి శరత్ బీఆర్‌ను డకౌట్ చేశాడు. నాలుగో బంతికి జె.సుచిత్‌ (0)ను పెవిలియన్ పంపి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. చివరి బంతికి ఫామ్‌లో ఉన్న అభినవ్ మనోహర్ (27)ను అవుట్ చేసి డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. ఫలితంగా ఈ రికార్డు సాధించిన రెండో భారత బౌలర్‌గా తన పేరును చరిత్ర పుస్తకాల్లో లిఖించుకున్నాడు.

అంతకుముందు టీమిండియా మాజీ పేసర్ అభిమన్యు మిథున్ ఈ రికార్డు సాధించాడు. అయితే, మిథున్ ఏకంగా ఐదు బంతుల్లో ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ పంపి సంచలనం సృష్టించాడు. కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించిన మిథున్ 2019లో హర్యానా మ్యాచ్‌తో ఈ ఘనత సాధించాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో చూసుకుంటే శ్రీలంక మాజీ క్రికెటర్ లసిత్ మలింగ పేరుపై ఈ రికార్డు ఉంది.

2019లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మలింగ ఈ రికార్డు అందుకున్నాడు. కాగా, డబుల్ వికెట్‌తో దర్శన్ రికార్డు సృష్టించినప్పటికీ విదర్భ జట్టు గెలుపు ముంగిట బోల్తా పడింది. కర్ణాటక నిర్దేశించిన 177 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరు వికెట్లు కోల్పోయి 172 పరుగులు మాత్రమే సాధించి పరాజయం పాలైంది.


More Telugu News