సంస్కార హీనులకు అసెంబ్లీ వేదిక కావడం దురదృష్టకరం: కాంగ్రెస్ ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్

  • తెలుగు జాతి చరిత్రలో దుర్దినం
  • నిండు శాసనసభలో వైసీపీ నేతలు పచ్చి బూతులు మాట్లాడుతున్నారు
  • కౌరవులకు ఎలాంటి గతి పట్టిందో గుర్తుందా?
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శుక్రవారం జరిగిన ఘటన దురదృష్టకరమని, తెలుగు జాతి చరిత్రలో ఓ దుర్దినమని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ సాకే శైలాజానాథ్, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరిపై పశువుల కంటే హీనంగా వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కుమార్తెకు అసెంబ్లీలో అవమానం జరగడం గర్హనీయమన్నారు. నిండు శాసనసభలో వైసీపీ నేతలు పచ్చి బూతులు మాట్లాడుతున్నారని, వారి ప్రవర్తన జుగుప్స కలిగిస్తోందన్నారు.

సంస్కారవంతులు, ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన సభ నేడు సంస్కార హీనులకు వేదిక కావడం దురదృష్టకరమని అన్నారు. అర్థవంతమైన చర్చలు జరగాల్సిన చోట చంద్రబాబు, భువనేశ్వరిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రమూ సరికాదన్నారు. కౌరవ సభలో సంస్కార హీనంగా ప్రవర్తించిన దుర్యోధన, దుశ్శాసనులకు ఎలాంటి గతి పట్టిందో ఒకసారి గుర్తు చేసుకోవాలని, శిశుపాలుడిలా వైసీపీ నేతల వంద తప్పులు పూర్తయ్యాయని అన్నారు. ఇక వారి అరాచకాలను చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.


More Telugu News