విస్కీ వాసన చూడడమే అతడి విధి... కరోనా ఎఫెక్ట్ తో ఇల్లు కదిలితే ఒట్టు!

  • ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం
  • విస్కీ టేస్టర్ గా పనిచేస్తున్న బ్లెయిర్ బౌమాన్
  • లక్షల డాలర్ల మేర పారితోషికం
  • కరోనా రాకతో ఉపాధికి బ్రేక్
  • కరోనా వస్తే వాసన చూసే శక్తిని కోల్పోతానని భౌమాన్ భయం
ప్రపంచంలో కొన్ని ఆశ్చర్యకరమైన ఉద్యోగాలు ఉంటాయి. వాటిలో ఒకటి విస్కీ టేస్టర్ ఉద్యోగం. విస్కీ నాణ్యతను గుర్తించడమే వారి విధి. విస్కీ రుచి, వాసన ఎలా ఉన్నాయో వారు పరిశీలిస్తుండాలి. నిపుణులైన విస్కీ టేస్టర్లకు లిక్కర్ కంపెనీలు లక్షల డాలర్లు కుమ్మరిస్తుంటాయి. వరల్డ్ ఫేమస్ విస్కీ టేస్టర్లలో బ్లెయిర్ బౌమాన్ కూడా ఒకరు. స్కాట్లాండ్ లోని ఎడింబర్గ్ కు చెందిన 31 ఏళ్ల బౌమాన్ అనేక విస్కీ కంపెనీలకు టేస్టర్ గా వ్యవహరిస్తున్నాడు.  

అయితే కరోనా సంక్షోభం కారణంగా బౌమాన్ 2020 మార్చి నుంచి తన ఇంటికే పరిమితం అయ్యాడు. కరోనా వ్యాప్తితో బౌమాన్ లో కొత్త సందేహం బయల్దేరింది. కరోనా లక్షణాల్లో వాసన కోల్పోవడం కూడా ఓ ముఖ్య లక్షణమే. మరి బౌమాన్ వృత్తి వాసన చూడడమే కదా! కరోనా వస్తే తన ఉపాధికి భంగం కలుగుతుందన్నది అతని బాధ!

కరోనా ఆంక్షల కారణంగా ఇప్పటికే వందల కొద్దీ ఒప్పందాలను వద్దనుకున్నానని బౌమాన్ వాపోయాడు. బౌమాన్ ప్రత్యేకత ఏంటంటే... సుప్రసిద్ధ విస్కీ కంపెనీలకే కాదు, ప్రైవేటు వ్యక్తులకు కూడా విస్కీ నాణ్యతను గుర్తించడంలో సేవలు అందిస్తుంటాడు. గత పదేళ్లుగా విస్కీ పరిశ్రమలో కొనసాగుతున్నాడు. లక్షల వేతనం అతడిని ఎప్పుడూ ఊరిస్తూనే ఉంటుంది. విస్కీ టేస్టింగ్ ఈవెంట్ల కోసం ప్రపంచంలో ఏమూలకైనా వెళ్లి వస్తుంటాడు.

ప్రస్తుతం తన జీవితభాగస్వామితో కలిసుంటున్న బౌమాన్ ఇంటి నుంచి బయటికి కదలడంలేదట. కారణం ఏంటంటే... కరోనా సోకితే అది తన వాసన చూసే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందన్నది అతడి భయం! ఓ పబ్/రెస్టారెంట్ కు వెళ్లి 20 నెలలు అయిందంటే మనవాడు ఎంత జాగ్రత్తగా ఉంటున్నాడో అర్థమవుతుంది. బయట ఎక్కడైనా విందుకు వెళ్లడం అంటే తన జీవితం రిస్క్ లో పడ్డట్టేనని అంటున్నాడు. అసలు ఆ ఆలోచనే రానివ్వడంలేదని చెబుతున్నాడు.

వారానికి ఓసారి బయటకు వెళతానని, షాపు ముందుకు వెళ్లి కారులో కూర్చునే వస్తువులు ఆర్డర్ చేస్తానని తెలిపాడు. షాపు వారు తన సరుకులను ట్రాలీల్లో పెట్టుకుని కారు వద్దకు తీసుకువస్తారని, ఆ సంచులను కారులోకి తీసుకుని ఇంటికి వచ్చేస్తానని వివరించాడు. అంతకుమించి తాను బయటికి వెళ్లే సందర్భం మరేదీ లేదని బౌమాన్ తెలిపాడు. తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులకు విందు ఇవ్వాలని భావించానని, అందుకోసం తీసుకువచ్చిన వైన్, షాంపేన్ బాటిళ్లు తన ఇంటి సెల్లార్ లోనే మగ్గుతున్నాయని వెల్లడించాడు.

కరోనా సంక్షోభానికి ముందు అనేక దేశాలు తిరిగిన బౌమాన్ ను కరోనా భయం ఇంటికే పరిమితం చేసింది. కరోనా బారినపడాలని తాను కోరుకోవడంలేదని, ఎప్పట్లానే స్వేచ్ఛగా విస్కీ టేస్టర్ గా పనిచేసేందుకు తహతహలాడుతున్నానని బౌమాన్ వెల్లడించాడు.


More Telugu News