అసెంబ్లీలో జరిగిన ఘటన దురదృష్టకరం: కల్యాణ్ రామ్

  • అసెంబ్లీ ఒక దేవాలయం వంటిది
  • మహిళలను గౌరవించడం సంప్రదాయం
  • రాజకీయ నేతలు హుందాగా నడుచుకోవాలి
నిన్నటి అసెంబ్లీ సమావేశాల ఘటనపై సినీ నటుడు నందమూరి కల్యాణ్ రామ్ స్పందిస్తూ, అసెంబ్లీలో జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి, వాటిని పరిష్కరించేందుకు పాటుపడే ఒక దేవాలయం వంటిదని చెప్పారు. అక్కడ ఎంతోమంది మేధావులు, చదువుకున్నవారు ఉంటారని అన్నారు. అలాంటి ఒక గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం చాలా బాధాకరమని చెప్పారు. ఇది సరైన విధానం కాదని అన్నారు.

సాటి వ్యక్తిని, ముఖ్యంగా మహిళలను గౌరవించడం మన సంప్రదాయమని... అలాంటిది అసెంబ్లీలో మహిళలను అకారణంగా దూషించే పరిస్థితి ఎదురుకావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ హుందాగా నడుచుకోవాలని కోరుతున్నానని చెప్పారు. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దైవత్వం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. పూజ్యులు రామారావుగారు మహిళలకు ఇచ్చిన గౌరవాన్ని అందరం ఒక్కసారి గుర్తు చేసుకుందామని చెప్పారు.


More Telugu News