చంద్రబాబు కంటతడి పెట్టడం దిగ్భ్రాంతికి గురి చేసింది.. ఇకనైనా మనుషులుగా మారండి: నాగబాబు

  • ఆంధ్ర రాజకీయం పరాకాష్ఠలకు నిలయంగా మారుతోంది
  • నాయకులు హీనాతిహీనమైన పురుగులుగా నిరూపించుకుంటున్నారు
  • ఒకరిని దూషించే హక్కు ఎవరికీ లేదు
అసెంబ్లీలో తన అర్ధాంగి గురించి వైసీపీ నేతలు దారుణంగా మాట్లాడారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న కన్నీరుపెట్టిన విషయం విదితమే. దీనిపై తాజాగా జనసేన పార్టీ నేత, సినీ నటుడు నాగబాబు మాట్లాడుతూ వైసీపీపై మండిపడ్డారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఇది దుర్దినమని అన్నారు.

ఎంతో ఉన్నతమైనదిగా, ఉత్తమమైనదిగా ప్రాచుర్యం పొందిన మన రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును తలచుకుని బాధపడాలో లేక భయపడాలో తెలియని సందిగ్ధ దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తమకు ప్రత్యర్థి అయి ఉండొచ్చని... టీడీపీ తమకు ప్రతిపక్షం అయ్యుండొచ్చని... కానీ, చంద్రబాబు వంటి ఒక నేత ఇలా కన్నీటిపర్యంతం అయిన ఘటన తనను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసిందని నాగబాబు అన్నారు.

ఆంధ్ర రాష్ట్ర రాజకీయం రోజురోజుకి పరాకాష్ఠలకు నిలయంగా మారుతోందని చెప్పారు. ఒక ముఖ్యమంత్రిని 'భో...కె' అని దూషించి, ఒక మాజీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని అసభ్యకర పదజాలంతో కించపరిచి... తమను తాము హీనాతిహీనమైన విలువలు లేని పురుగులుగా నాయకులు నిరూపించుకుంటున్నారని నాగబాబు దుయ్యబట్టారు. నీకు ఒకరిని విమర్శించే నైతిక హక్కు తప్ప... వారిని తిట్టడం లేదా దూషించే అధికారం ఏమాత్రం లేదని అన్నారు.

గతంతో తన తమ్ముడు పవన్ కల్యాణ్ ని, తన కుటుంబాన్ని ఇలాగే అనుచిత పదాలతో విమర్శించినప్పుడు ఎంతో క్షోభకు గురైన వ్యక్తిగా, ఆ బాధను అనుభవించిన వ్యక్తిగా చెపుతున్నానని... ఇది అనాగరికం మరియు సాటి మనుషుల క్రూరత్వమని చెప్పారు. నీకు ఒకరు చేసింది తప్పు అనిపిస్తే ప్రశ్నించాలని, నిలదీయాలని లేదా తప్పు ఉంటే కమిటీ వేసి నిరూపించి శిక్షించాలని... అంతేకాని ఇలాంటి నీచ సంస్కృతికి దిగజారకండని అన్నారు. ఏ పార్టీ అయినా, ఏ పార్టీ నాయకుడైనా, వారి పట్ల కనీస గౌరవాన్ని పాటించి... ఇకనైనా మనుషులుగా మారతారని ఆశిస్తున్నానని చెప్పారు.


More Telugu News