మోదీ నిర్ణయంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎలాంటి ప్రయోజనం ఉండదు: మహారాష్ట్ర షేత్కారీ సంఘటన్ చీఫ్

  • ప్రభుత్వ నిర్ణయం దురదృష్టకరం
  • ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ప్రభుత్వం స్పందించలేదు
  • మరో 50 సంవత్సరాల వరకు మరే ప్రభుత్వమూ ఇలాంటి చట్టాలు తీసుకొచ్చే సాహసం చేయదు
  • మూడు నెలలపాటు కష్టపడి తయారు చేసిన నివేదికను బుట్టదాఖలు చేస్తారా?
రైతుల ఆందోళనకు తలొగ్గి మూడు సాగు చట్టాలను కేంద్రం రద్దు చేయడంపై మహారాష్ట్ర షేత్కారీ సంఘటన్ అధ్యక్షుడు, సాగు చట్టాలపై సుప్రీంకోర్టు నియమిత కమిటీ సభ్యుడు అనిల్ ఘన్వాట్ స్పందించారు. రాజకీయ కోణంతోనే సాగు చట్టాలను రద్దు చేశారని, ఇది దురదృష్టకరమని అన్నారు. ఈ నిర్ణయంతో రైతుల ఆందోళనకు ఫుల్‌స్టాప్ పడదని, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎలాంటి ప్రయోజనం ఉండబోదని తేల్చి చెప్పారు. రైతుల ఆందోళన తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఏమాత్రం స్పందించని కేంద్రం ఇప్పుడు మాత్రం వారికి తలవంచిందని విమర్శించారు.

కేంద్రం నిర్ణయం రైతులకే కాదని, యావత్ భారత దేశానికీ హానికరమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాత సాగు చట్టాల కారణంగా లక్షలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పుడీ కొత్త సాగు చట్టాలను రద్దు చేయడంతో మరో 50 ఏళ్లపాటు మరే ప్రభుత్వమూ సాగు చట్టాలను సంస్కరించే సాహసం చేయబోదన్నారు. తమ కమిటీ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు ఇప్పటి వరకు చర్చించలేదన్నారు.

నివేదికలో తాము పేర్కొన్న లోపాలను సరిచేసి ఉంటే దేశానికి మేలు జరిగేదని అన్నారు. తాము సమర్పించిన నివేదికను సుప్రీంకోర్టు విడుదల చేయకుంటే తాము దానిని ప్రజల ముందుకు తీసుకొస్తామన్నారు. మూడు నెలలు కష్టపడి తయారుచేసిన ఈ నివేదికను బుట్టదాఖలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. కాగా, కమిటీలోని మరో సభ్యుడు అశోక్ గులాటి మాట్లాడుతూ.. ఆందోళన చేస్తున్న అన్నదాతలు ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చని అన్నారు.


More Telugu News