కార్తిక దీపాలు వదులుతూ కాల్వలో పడి దంపతుల మృత్యువాత

  • కార్తిక దీపాలు వదులుతూ ప్రమాదవశాత్తు కాల్వలో పడిన భార్య
  • ఆమెను రక్షించే క్రమంలో కాల్వలోకి దూకిన భర్త
  • నాలుగు కిలోమీటర్ల దూరంలో మృతదేహాల లభ్యం
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని కాల్వలో దీపాలు వదిలేందుకు వెళ్లిన దంపతులు అందులో పడి మృతి చెందారు. కర్నూలులో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. నగరంలోని అబ్బాస్ నగర్‌కు చెందిన రాఘవేంద్రప్రసాద్ (44), ఇందిర (41) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని రాఘవేంద్రప్రసాద్ దంపతులు నిన్న తెల్లవారుజామున 5 గంటలకు వినాయక్ ఘాట్ వద్ద కేసీ కాల్వ పక్కనే ఉన్న గుడికి వెళ్లారు.

పూజల అనంతరం కాల్వలో దీపం వదులుతూ ప్రమాదవశాత్తు ఇందిర అందులో పడిపోయారు. ఆమెను రక్షించే క్రమంలో భర్త రాఘవేంద్రప్రసాద్ కూడా కాల్వలో పడిపోయారు. అప్రమత్తమైన స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే, నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండడంతో వారు కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో జహారాపురం వద్ద వారి మృత దేహాలను గుర్తించారు.


More Telugu News