రాహుల్, రోహిత్ వీరబాదుడు.. సిరీస్ భారత్ కైవసం

  • 154 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 16 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన భారత్
  • ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా హర్షల్ పటేల్
  • రేపు కోల్‌కతాలో చివరి టీ20
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గత రాత్రి రాంచీలో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించి సిరీస్‌ను ఎగరేసుకుపోయింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (49 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 పరుగులు), కెప్టెన్ రోహిత్ శర్మ (36 బంతుల్లో ఫోర్, 5 సిక్సర్లతో 55 పరుగులు) దంచి కొట్టడంతో న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల విజయ లక్ష్యం చిన్నదైపోయింది.

ఆ తర్వాత వీరిద్దరూ పెవిలియన్ చేరినప్పటికీ, వెంకటేశ్ అయ్యర్ (12), రిషభ్ పంత్ (12) పని పూర్తి చేశారు. ఫలితంగా 17.2 ఓవర్లలోనే భారత్ విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్ లో హీరో సూర్యకుమార్ యాదవ్ ఒక పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. భారత్ కోల్పోయిన మూడు వికెట్లు టిమ్ సౌథీ ఖాతాలోకే చేరడం గమనార్హం.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ (31), డరిల్ మిచెల్ (31) ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించారు. గప్టిల్ అయితే క్రీజులో ఉన్న కాసేపు బ్యాట్‌కు పనిచెప్పాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. వీరి దూకుడు చూసి కివీస్ భారీ స్కోరు సాధిస్తుందని భావించారు. 48 పరుగుల వీరి భాగస్వామ్యానికి దీపక్ చాహర్ తెరదించడంతో స్కోరు వేగం మందగించింది.

ఆ తర్వాత మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ కొంత పోరాడినప్పటికీ భారత బౌలర్లపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. తొలుత భారీగా పరుగులు సమర్పించుకున్న బౌలర్లు ఆ తర్వాత కట్టడి చేశారు. దీంతో కివీస్ పరుగుల వానకు కళ్లెం పడింది. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ 2 వికెట్లు తీసుకోగా, భువనేశ్వర్ కుమార్, చాహర్, అక్సర్ పటేల్, అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు. అరంగేట్ర ఆటగాడు హర్షల్ పటేల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. రేపు కోల్‌కతాలో ఇరు జట్ల మధ్య చివరి టీ20 జరగనుంది.


More Telugu News