అమెరికా అధ్యక్షురాలిగా కాసేపు కమలా హారిస్... ఎలాగంటే..!

  • అధ్యక్షుడు జో బైడెన్ కు వైద్యపరీక్షలు
  • కొలనోస్కోపీ చేసిన వైద్యులు
  • తన బాధ్యతలను కాసేపు కమలాకు అప్పగించిన బైడెన్
  • ఇన్చార్జి అధ్యక్షురాలిగా వ్యవహరించిన కమలా
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొద్ది సమయం పాటు తన అధ్యక్ష బాధ్యతలను ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు అప్పగించారు. ఈ అరుదైన ఘటన తాజాగా చోటుచేసుకుంది. జో బైడెన్ రేపు 79వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన హెల్త్ చెకప్ చేయించుకున్నారు. చెకప్ లో భాగంగా బైడెన్ కు వైద్యులు కొలనోస్కోపీ కూడా నిర్వహించారు. కొలనోస్కోపీ సందర్భంగా బైడెన్ కు మత్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా పూర్తయ్యేసరికి కొంత సమయం పడుతుంది.

అందుకే వైద్య పరీక్షలకు వెళ్లేముందు బైడెన్ తన బాధ్యతలను ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కి అప్పగించారు. ఆ విధంగా కమలా హారిస్ కాసేపు అగ్రరాజ్యానికి ఇన్చార్జి అధ్యక్షురాలిగా వ్యవహరించారు. బైడెన్ వైద్య పరీక్షలు చేయించుకుంటున్న సమయంలో కమలా హారిస్ వైట్ హౌస్ లోని వెస్ట్ వింగ్ లో ఉన్న తన కార్యాలయం నుంచి విధులు నిర్వర్తించారని మీడియా కార్యదర్శి జెన్ సాకీ వెల్లడించారు.


More Telugu News