కృష్ణుడి విగ్రహం చేయి విరిగితే కట్టు కట్టాలంటూ ఆసుపత్రికి తీసుకొచ్చిన పూజారి!

  • యూపీలోని ఆగ్రాలో ఘటన
  • అర్జున్ నగర్ లో కొలువై ఉన్న బాలకృష్ణుడి ఆలయం
  • అభిషేకం చేయిస్తుండగా కిందపడిన విగ్రహం
  • విగ్రహం చేయి విరగడంతో విలవిల్లాడిన పూజారి
  • స్వామివారితో తనకెంతో అనుబంధం ఉందని వ్యాఖ్య 
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. శ్రీకృష్ణుడి విగ్రహానికి చేయి విరిగిపోవడంతో, దానికి కట్టు కట్టాలంటూ ఆలయ పూజారి ఆ విగ్రహాన్ని ఆసుపత్రికి తీసుకొచ్చిన వైనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అర్జున్ నగర్ లోని పఠ్వారీ ఆలయంలో ఉన్న బాలకృష్ణుడి విగ్రహం భక్తుల పూజలందుకుంటోంది. ఆ ఆలయంలో గత 30 ఏళ్లుగా లేఖ్ సింగ్ పూజారిగా వ్యవహరిస్తున్నాడు.

అయితే ఉదయం స్వామివారికి అభిషేకం చేయిస్తుండగా విగ్రహం పొరబాటున చేయిజారి కిందపడింది. దాంతో ఆ విగ్రహం చేయి విరిగింది. ఈ పరిణామంతో ఆ పూజారి తల్లడిల్లిపోయాడు. ఓ పసిబిడ్డను పొదివిపట్టుకున్నట్టుగా బాలకృష్ణుడి విగ్రహాన్ని అత్యంత జాగ్రత్తగా జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చాడు. విగ్రహానికి చేయి విరిగిపోయిందని, కట్టు కట్టాలని ఆసుపత్రి సిబ్బందిని కోరాడు. దాంతో ఆసుపత్రి సిబ్బంది ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. తాము విన్నది నిజమేనా అని విస్మయానికి లోనయ్యారు.

చేయి విరిగిపోయిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాలకృష్ణుడితో తనకు ఎంతో అనుబంధం పెనవేసుకుందని పూజారి లేఖ్ సింగ్ తెలిపాడు. దయచేసి విగ్రహానికి చికిత్స చేయాలని విజ్ఞప్తి చేశాడు. దాంతో అతడికి సంతృప్తి కలిగించేందుకు ఆ ఆసుపత్రి సిబ్బంది విగ్రహానికి నిజంగానే కట్టు కట్టారు. ఆసుపత్రి రిజిస్టర్ లో పేషెంట్ పేరు 'శ్రీ కృష్ణ' అని నమోదు చేసుకున్నామని ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటిండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ అగర్వాల్ వెల్లడించారు.


More Telugu News