గుజరాత్ నుంచి వచ్చిన నలుగురు దేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు: రేవంత్ రెడ్డి

  • వ్యయసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం రైతులు సాధించిన విజయం
  • సైనికుల మాదిరి రైతులు పోరాడారు
  • ఈ చట్టాలకు కేసీఆర్ కూడా ఓటేశారు
మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ... ఇది రైతులు సాధించిన ఘన విజయమని చెప్పారు. ప్రభుత్వం మెడలు వంచి, నల్ల చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకునేలా చేశారని అన్నారు.

దేశ సరిహద్దులో సైనికులు ఎలా పోరాడతారో... అదే స్ఫూర్తితో రైతులు కూడా ఉద్యమం చేశారని చెప్పారు. గుజరాత్ నుంచి బయలుదేరిన నలుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.  

దేశ వ్యవసాయరంగాన్ని అదానీ, అంబానీకి కట్టబెట్టేందుకు మోదీ, అమిత్ షా చూశారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఇందిరాగాంధీ పుట్టినరోజున నల్ల చట్టాల రద్దుతో రైతులు ఘన విజయం సాధించారని అన్నారు. వందలాది మంది ప్రాణాలు పోవడానికి కారణమైన మోదీని రైతులు క్షమించరని చెప్పారు.

ఇదే సమయంలో సీఎం కేసీఆర్ పై కూడా రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా పార్లమెంటులో కేసీఆర్ ఓటేశారని విమర్శించారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా సభలో తీర్మానం చేసే ధైర్యం లేదుకానీ... ఇప్పుడు క్రెడిట్ మొత్తం తమదే అన్నట్టుగా టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని... ఇది రైతులను, వారి ఉద్యమాన్ని అవమానించడమే అని చెప్పారు.


More Telugu News