ఇది మన రైతుల ఘన విజయం.. సాగు చట్టాల రద్దుపై ప్రతిపక్షాల స్పందన!

  • సత్యాగ్రహంతో అహంకారం తలదించారన్న రాహుల్
  • సాగు చట్టాలు వెనక్కు తీసుకుంటుందని గతంలోనే చెప్పానంటూ కామెంట్
  • ప్రకాశ్ దివస్ నాడు మంచి వార్త విన్నా: కేజ్రీవాల్
  • క్రూరత్వానికి తలొగ్గని పోరాటం: మమత
కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేయం పట్ల ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. ‘ఇది కేంద్ర ప్రభుత్వం అహంకారపు ఓటమి.. రైతుల విజయం’ అంటూ వ్యాఖ్యానించాయి. రైతులకు శుభాకాంక్షలు తెలిపాయి. అహంకారం వీడింది.. రైతు గెలిచాడంటూ కాంగ్రెస్ కామెంట్ చేసింది. రాహుల్ గాంధీ ట్విట్టర్ లో స్పందించారు.

‘‘అన్నదాతలు వారి సత్యాగ్రహంతో అహంకారం తలదించేలా చేశారు. అన్యాయంపై విజయం సాధించిన రైతులందరికీ శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు. అంతేగాకుండా.. కేంద్ర ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటుందని గతంలో తాను చేసిన వ్యాఖ్యల వీడియోనూ ఆయన పోస్ట్ చేశారు. తాను ఆనాడు చెప్పిందే ఈనాడు నిజమైందని దానికి కామెంట్ పెట్టారు.

ప్రకాశ్ దివస్ నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి వార్తను విన్నామని, దేశ రైతులకు సెల్యూట్ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సాగు చట్టాల రద్దు కోసం 700 మంది రైతులు ఆత్మబలిదానాలు చేశారని, వారి త్యాగాలకు ప్రతిఫలం దక్కిందని అన్నారు. వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం రైతులంతా ప్రాణాలకు తెగించి పోరాడిన విధానాన్ని రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయని కొనియాడారు.

క్రూరత్వానికి తలొగ్గకుండా పోరాడిన ప్రతి ఒక్క రైతుకు శుభాకాంక్షలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఇది రైతు విజయమని, ఆందోళనల సందర్భంగా ప్రాణ త్యాగాలు చేసిన రైతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రైతుల సత్యాగ్రహం చారిత్రాత్మక విజయం సాధించిందని, నల్ల చట్టాల రద్దు సరైన ముందడుగని పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ అన్నారు. అన్నదాతల త్యాగాలు ఫలించాయన్నారు.

గురునానక్ జయంతి రోజున పంజాబీల డిమాండ్లను అంగీకరించి నల్లచట్టాలను రద్దు చేసినందుకు మోదీకి కృతజ్ఞతలు అని పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. రైతుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని భావిస్తున్నానంటూ వ్యాఖ్యానించారు.


More Telugu News