చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లతో మరోసారి ఫోన్లో మాట్లాడిన సీఎం జగన్

  • దక్షిణ కోస్తాంధ్రపై వాయుగుండం ఎఫెక్ట్
  • నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు
  • జనజీవనం అస్తవ్యస్తం
  • జిల్లా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం
వాయుగుండం ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడికక్కడ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ మూడు జిల్లాల కలెక్టర్లతో ఉదయం ఓసారి మాట్లాడిన సీఎం జగన్ మరోసారి ఫోన్ చేసి తాజా పరిస్థితులను సమీక్షించారు. వర్షపాతం వివరాలు, ప్రభావం తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు.

రెండ్రోజుల పాటు భారీ వర్షసూచన ఉన్నందున రిజర్వాయర్లలో, చెరువుల్లో ఎప్పటికప్పుడు నీటి మట్టాలను గమనించుకుంటూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో తక్షణమే సహాయ శిబిరాలు ప్రారంభించాలని స్పష్టం చేశారు. సహాయ శిబిరాల్లో ఉన్న వారికి రూ.1,000 చొప్పున సాయం అందించాలని, వారికి అన్ని రకాల వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సహాయక చర్యల కోసం సంబంధిత శాఖలన్నీ వెంటనే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అవసరమైనంత మేర సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని... వైద్య ఆరోగ్య సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని పేర్కొన్నారు.

క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు వివరాలు అందిస్తుండాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏం కావాలన్నా వెంటనే అడగాలని, తాను నిరంతరం అందుబాటులోనే ఉంటానని మూడు జిల్లాల కలెక్టర్లకు స్పష్టం చేశారు.


More Telugu News