వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

  • 2019లో వైఎస్ వివేకా హత్య
  • కీలకదశలో సీబీఐ దర్యాప్తు
  • ఇటీవల మాజీ డ్రైవర్ దస్తగిరి సంచలన వాంగ్మూలం
  • శివశంకర్ రెడ్డి పేరును ప్రస్తావించిన దస్తగిరి
  • శివశంకర్ రెడ్డిని హైదరాబాదులో అరెస్ట్ చేసిన సీబీఐ
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం సంచలనం సృష్టించగా, ఆ వాంగ్మూలంలో ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేరు కూడా ఉంది.

దాంతో సీబీఐ అధికారులు శివశంకర్ రెడ్డిని హైదరాబాదులో అరెస్ట్ చేసి పులివెందుల తరలించారు. నేడు ఆయనను పులివెందుల కోర్టులో హాజరుపరచగా... కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో ఆయనను కడప జైలుకు తరలించారు. శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు పులివెందుల తీసుకువచ్చిన సమయంలో కోర్టు వద్ద భారీ కోలాహలం నెలకొంది. శివశంకర్ రెడ్డిని కలిసేందుకు ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు వైసీపీ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నాయి.

ఇదిలావుంచితే, అప్పట్లో వివేకా హత్య జరిగిన తర్వాత ఆయన కుమార్తె సునీతా రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నాడు న్యాయస్థానంలో సమర్పించిన అనుమానితుల జాబితాలో శివశంకర్ రెడ్డి పేరు కూడా ఉంది. అయితే దస్తగరి వాంగ్మూలం నేపథ్యంలో శివశంకర్ రెడ్డి పాత్రపై ఓ నిర్ధారణకు వచ్చిన సీబీఐ విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. అయితే, తన ఆరోగ్యం బాగాలేదని, ప్రస్తుతం తాను రాలేనని శివశంకర్ రెడ్డి చెప్పడంతో, సీబీఐ అధికారులు ఆయనను హైదరాబాదులో అదుపులోకి తీసుకున్నారు.


More Telugu News