గత ప్రభుత్వాల సమయంలో లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది?: మల్లు భట్టి విక్రమార్క

  • రైతుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి
  • వ్యవసాయరంగాన్ని కుదేలు చేయాలనుకుంటున్నారు
  • ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం ధర్నాలు చేస్తోంది
రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాదులో ఈరోజు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. పబ్లిక్ గార్డెన్స్ నుంచి వ్యవసాయ కమిషనరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, భట్టి విక్రమార్క, సీతక్క తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ వరి కొనుగోలు విషయంలో గత ప్రభుత్వాల హయాంలో ఎప్పుడూ సమస్య రాలేదని... ఎప్పుడూ రాని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వమే ధర్నాలు చేయడం ఏమిటని ఎద్దేవా చేశారు. రైతుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని అన్నారు. వ్యవసాయరంగాన్ని కుదేలు చేసి కార్పొరేట్లకు అందించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

సీతక్క మాట్లాడుతూ, కేసీఆర్ చేస్తున్నది దొంగ దీక్ష అని అన్నారు. రైతుల సమస్యలకు పరిష్కారం చూపకుండా దీక్షలకు దిగడం సిగ్గుచేటని విమర్శించారు. వడ్లను తెలంగాణ ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు.


More Telugu News