కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతాలు చేసింది: మంత్రి నిరంజన్ రెడ్డి

  • వరి ధాన్యం కొనకపోతే కేంద్రానికే నష్టం
  • ధాన్యం కొనుగోళ్లపై నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలి
  • ఐకమత్యంతో రైతులదే విజయమన్న మంత్రి
రైతుల ప్రయోజనాల కోసమే సీఎం కేసీఆర్ ధర్నాలో కూర్చున్నారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలన్న డిమాండ్ తో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద టీఆర్ఎస్ జరుపుతున్న ఆందోళనలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అద్భుతాలు జరిగాయని, పల్లెలన్నీ పచ్చబడ్డాయని అన్నారు. రాష్ట్రంలోని అద్భుత ప్రాజెక్టులతో బీడు భూముల్లోనూ పంటలు పండుతున్నాయన్నారు. రైతుబంధు వంటి పథకాలతో రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో అన్ని సీజన్లలోనూ వరి పండుతుందని చెప్పిన ఆయన.. ఈ వానాకాలంలో 63 లక్షల ఎకరాల్లో వరి వేశారన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వ అస్పష్ట విధానాలతో రైతులకు నష్టం కలుగుతోందని మండిపడ్డారు. కేంద్రం ఒప్పందం చేసుకున్న ధాన్యాన్నీ కొనట్లేదని విమర్శించారు. కేంద్రం తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని, లేదంటే నష్టపోక తప్పదని హెచ్చరించారు. రైతులు ఐకమత్యంగా ఉంటే అంతిమ విజయం రైతులదేనన్నారు. రైతులను కన్నీళ్లు పెట్టించిన ఏ ప్రభుత్వమూ బాగుపడలేదని ఆయన విమర్శించారు.


More Telugu News