చైనా ఆక్రమణ ధోరణి.. భూటాన్ లో నాలుగు గ్రామాల నిర్మాణం.. భారత్ కు ముప్పే!

  • డోక్లాం పీఠభూమికి సమీపంలోనే నిర్మాణాలు
  • భూటాన్ లో వంద చదరపు కిలోమీటర్ల మేర చొరబాటు
  • ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడి
విస్తరణ వాదంతో చైనా పొరుగుదేశాలపై కన్నేస్తోంది. హద్దులు దాటేస్తూ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇప్పటికే టిబెట్ ను తన వశం చేసుకున్న డ్రాగన్ కంట్రీ.. తైవాన్ పైనా కన్నేసింది. ఆ దేశం తమదేనంటూ పిచ్చి వాగుడు వాగుతోంది. యుద్ధానికి సిద్ధమంటూ ఫైటర్ జెట్లను పంపుతూ బెదిరింపులకు దిగుతోంది. భారత్ తో అరుణాచల్ ప్రదేశ్ పై గొడవకు దిగింది. కొన్ని నెలల క్రితం లడఖ్ లో హద్దులు దాటి వచ్చింది. సిక్కిం కూడా తమదేనంటోంది.
తాజాగా భూటాన్ నూ వదల్లేదు. ఆ దేశంలోకి కూడా చొచ్చుకెళ్లింది. దాదాపు 100 చదరపు కిలోమీటర్ల మేర ఆక్రమించేసింది. అది కూడా భారత్ తో 2017లో చైనా గొడవకు దిగిన డోక్లాం పీఠభూమికి అతి సమీపంలో ఉండడం ఆందోళన కలిగించే విషయం. భూటాన్ లో దాదాపు 4 గ్రామాలను డ్రాగన్ కంట్రీ నిర్మించేసినట్టు ఉపగ్రహ చిత్రాలు తేటతెల్లం చేస్తున్నాయి.
భూటాన్ విదేశీ సంబంధ వ్యవహారాలపై భారత్ సహకారం అందిస్తోంది. అంతేగాకుండా ఆ దేశ బలగాలకూ శిక్షణను కొనసాగిస్తోంది. అందులోనూ సరిహద్దుల మార్పుకు సంబంధించి భూటాన్ పై చైనా తరచూ ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలోనే డ్రాగన్ అరాచక ఆక్రమణలు భారత్ కు కొంత తలనొప్పి తెప్పిస్తాయన్న ఆందోళనవ వ్యక్తమవుతోంది. భూటాన్ పై మరింత ఒత్తిడి పెంచేందుకే అక్కడ చైనా గ్రామాలను నిర్మించిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


More Telugu News