రాహుల్ ద్రావిడ్ అలా చేయడు.. విజయాన్ని నెత్తికెక్కించుకోడు: గౌతం గంభీర్

  • జట్టులో ద్రావిడ్ విశ్వాసాన్ని పాదుకొల్పుతాడు
  • అందరిలా బిగ్ స్టేట్‌మెంట్లు ఇవ్వడు
  • ద్రావిడ్-రోహిత్ జంటపై భారీ అంచనాలు ఉంటాయని తెలుసు
  • ‘స్టార్ స్పోర్ట్స్’తో గౌతం గంభీర్ 
రవిశాస్త్రి హయాంలో మేజర్ ఐసీసీ టోర్నీల్లో చతికిలపడిన టీమిండియాపై అభిమానుల ఆశలు మళ్లీ అమాంతం పెరిగాయి. టీమిండియా మాజీ ఓపెనర్, వివాద రహితుడు అయిన రాహుల్ ద్రావిడ్ ప్రధాన కోచ్ బాధ్యతలు స్వీకరించడమే అందుకు కారణం. నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ జయకేతనం ఎగరవేసిన తర్వాత ఈ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. టీ20 ప్రపంచకప్‌ లీగ్ దశలో ఇదే కివీస్‌ జట్టుపై భారత్ దారుణంగా ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో ద్రావిడ్-రోహిత్ జంటపై అభిమానులు  ఆశలు పెంచేసుకున్నారు. భారత జట్టుకు పునర్వైభవం ఖాయమని చెబుతున్నారు.

తాజాగా ‘స్టార్ స్పోర్ట్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మాట్లాడుతూ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ ద్రావిడ్‌పై ప్రశంసలు కురిపించాడు. ద్రావిడ్ అందరిలాంటి వాడు కాదని కొనియాడాడు. హెడ్ కోచ్‌గా అతడి పదవీ కాలాన్ని చూడాలనుకుంటున్నానని చెప్పాడు. అయితే, వాస్తవిక అంచనాలను మాత్రమే పెట్టుకోవాలని నొక్కి చెప్పాడు. జట్టులో ద్రావిడ్ క్రమశిక్షణ నెలకొల్పుతాడని, ఆటగాళ్లకు మరీ ముఖ్యంగా యువ ఆటగాళ్లలో భరోసా నింపుతాడని అన్నాడు.

ద్రావిడ్ అందరిలాంటి వాడు కాదని, అతడేమీ పెద్దపెద్ద ప్రకటనలేమీ ఇవ్వడని, సక్సెస్‌ను చూసి మురిసిపోడని అన్నాడు. సక్సెస్‌ను నెత్తికెక్కించుకోకపోవడం ద్రావిడ్‌లో ఉన్న మరో గొప్ప లక్షణమని గంభీర్ ప్రశంసించాడు. అంతేకాక విజయం తర్వాత పెద్దపెద్ద స్టేట్‌మెంట్లు కూడా ఇవ్వడన్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయమన్నాడు. గత రెండేళ్లలో భారత జట్టు మేనేజ్‌మెంట్ నుంచి ఇలాంటి ప్రకటనలు చాలానే వచ్చాయన్నాడు. ఇలాంటి వాటి వల్ల యువ ఆటగాళ్లు దూరమయ్యే ప్రమాదం ఉందన్నాడు.

రాహుల్ చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాడని, అతడికి రోహిత్‌శర్మ లాంటి మరో బ్యాలెన్స్‌డ్ క్రికెటర్ దొరికాడని అన్నాడు. ఈ జంట భారత క్రికెట్‌కు ఎన్నో విజయాలు అందిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పాడు. అయితే, ఒకటి రెండు సిరీస్‌లతోనే పరిస్థితులు మారిపోతాయని అనుకోవద్దన్నాడు. రవిశాస్త్రి హయాంలో భారత జట్టు ఐసీసీ మేజర్ టోర్నీల్లో రాణించలేకపోయిందని, అంతమాత్రాన అభిమానులు సహనం కోల్పోవాల్సిన అవసరం లేదన్నాడు. ఒకటి రెండు సిరీస్‌లతోనే పరిస్థితుల్లో మార్పు కనిపించదని పేర్కొన్నాడు.

‘‘భరోసా, కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణ (ద్రావిడ్ ఈ విషయాన్ని చూసుకుంటాడు) చాలా అవసరం. అదే సమయంలో మన అంచనాలు వాస్తవికంగా ఉండాలి. ఒకటి రెండు సిరీస్‌లతోనే పరిస్థితుల్లో మార్పు రాదు. ఐసీసీ టోర్నీలలో పెద్దగా రాణించలేకపోయాం కాబట్టి ద్రావిడ్-రోహిత్ జోడీపై భారీ అంచనాలు ఉంటాయని నాకు తెలుసు’’ అని గౌతమ్ చెప్పుకొచ్చాడు.

అయితే, అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవరైనా రాణించాలంటే భరోసా, స్వేచ్ఛ, క్రమశిక్షణ చాలా అవసరమని నొక్కి చెప్పాడు. ద్రావిడ్ వీటన్నింటినీ తీసుకొస్తాడని భావిస్తున్నట్టు చెప్పాడు. ఆటగాళ్లు అలా ఉంటే కోచ్ దానిని అమలు చేస్తాడని, అంతమాత్రాన కోచ్ వెళ్లి విజయాలు సాధించుకొస్తాడని కాదని స్పష్టం చేశాడు. కోచ్ భరోసా మాత్రమే ఇవ్వగలడని గౌతమ్ వివరించాడు.


More Telugu News