తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు

  • నేడు ఏపీ, తమిళనాడు తీరాలకు చేరనున్న అల్పపీడనం
  • అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణ వైపు గాలులు
  • నిన్న వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో అత్యధిక వర్షపాతం నమోదు
తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు తెలిపింది.

అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణవైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. నిన్న కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో 3.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.


More Telugu News